హైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ): డిసెంబర్ 9నే రైతులకు రూ.2 లక్షల రుణ మాఫీ చేస్తామన్న కాంగ్రెస్, ఇప్పటివరకూ ఎందుకు చేయలేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ప్రశ్నించారు. తప్పుడు వాగ్దానాలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, ఇప్పుడు హామీల ఊసెత్తడంలేదని విమర్శించారు. శుక్రవారం తెలంగాణ భవన్లో మెదక్ లోక్‌సభ బీఆర్ఎస్ సన్నాహక సమావేశం జరిగింది.
సమావేశం అనంతరం సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు, ఇందిరమ్మ ఇండ్లు, రూ.2 లక్షల రుణమాఫీ, ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తామని తప్పుడు ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నచోట ప్రొటోకాల్ ఉల్లంఘనలు జరుగుతున్నాయని, ఎన్నికల్లో ఓడిపోయినవారు రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్యేల హక్కులకు గౌరవం ఇవ్వడంలేదని, రాజ్యాంగం కల్పించిన హక్కులను తుంగతలో తొక్కుతున్నారని ఆరోపించారు. అధికారిక కార్యక్రమాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
మెదక్ లోక్‌సభ బీఆర్ఎస్ అడ్డా
మెదక్ లోక్‌సభ స్థానం బీఆర్ఎస్కు అడ్డాగా ఉన్నదని సునీత తెలిపారు. ఇప్పటికే వరుసగా మూడుసార్లు బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారని, వచ్చే ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ అభ్యర్థి ఘన విజయం సాధిస్తారని చెప్పారు. మెదక్ పార్లమెంట్ పరిధిలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచారని గుర్తుచేశారు. బీఆర్ఎస్ శ్రేణులపై ప్రభు త్వం అక్రమ కేసులు, కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. బాధిత కార్యకర్తలకు అండగా ఉంటామని కేటీఆర్, హరీశ్‌రావు భరోసా ఇచ్చారని తెలిపారు.
గతంలో నియోజకవర్గంలో మంజూరైన ఎస్డీఎఫ్, మున్సిపాలిటీ, పీఆర్, ఇతర శాఖల పనులను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దుచేసిందని ఆరోపించారు. ప్రతి నియోజకవర్గానికి రూ.200 నుంచి రూ.300 కోట్ల పనులను రద్దు చేసిందని తెలిపారు. ఆ పనులన్నీ తిరిగి కొనసాగించాలని డిమాండ్‌చేశారు. మాజీ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎంపీ ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేద్దామని శ్రేణులకు పిలుపునిచ్చారు. సమావేశంలో ఎమ్మెల్యే చింత ప్రభాకర్, బీఆర్ఎస్ నేత వంటేరు ప్రతాప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.