హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): మహబూబ్‌నగర్ పర్యటనలో సీఎం రేవంత్‌రెడ్డి కురుమూర్తి వేంకటేశ్వరస్వామి సాక్షిగా అబద్ధాలు చెప్పారని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ విరుచుకుపడ్డారు. సోమవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి, కొడంగల్ జడ్పీటీసీ సభ్యుడు మహిపాల్‌రెడ్డి, బీఆర్ఎస్ నేతలు ఆంజనేయగౌడ్, డాక్టర్ కురువ విజయ్‌తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. బూర్గుల రామకృష్ణారావు తర్వాత మహబూబ్‌నగర్ నుంచి ముఖ్యమంత్రిగా పనిచేసే అవకాశం రేవంత్‌రెడ్డికి వచ్చిందని, ఆయనకు చిత్తశుద్ధి ఉంటే ఈ నాలుగేండ్లలో కేసీఆర్‌కంటే నాలుగింతలు నిధులు ఎక్కువ తెచ్చి అభివృద్ధి చేయాలని సూచించారు.
మూడు, నాలుగు నెలల్లో పూర్తయ్యే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఏడాదిలో పాలనను గాలికొదిలి కేసీఆర్‌పై తిట్లు, దేవుళ్లపై ఒట్లు పెట్టడం తప్ప రేవంత్ చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. మహబూబ్‌నగర్ అంధులకాలనీలో 75 మంది ఇండ్లు కూలగొడితే పట్టించుకోకపోగా, బాధితులకు అండగా ఉన్న తన తమ్ముడిపై కేసులు పెట్టించారని మండిపడ్డారు. ఆయన పాలమూరు బిడ్డే అయితే మన్నెంకొండ ఆలయాభివృద్ధికి నిధులివ్వాలని డిమాండ్ చేశారు.
పాలమూరుకు ఎన్ని నిధులిచ్చినవ్? : ఆల
రేవంత్‌రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో ఆటవిక పాలన కొనసాగుతున్నదని మాజీ ఎమ్మె ల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి విమర్శించారు. కేసీఆర్ సీఎం అయిన మొదటి నెలలోనే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు రూ.30 వేల కోట్లు కేటాయించారని గుర్తుచేశారు. 2,3 నెలల్లో పూర్తిచేసి 10 లక్షల ఎకరాల కు నీరందించే అవకాశమున్న ఈ ప్రాజెక్టును రేవంత్ పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. 11 నెలల్లో పాలమూరుకు ఏం చేశారు? ఎన్ని నిధులిచ్చారో చెప్పాలని నిలదీశారు.