హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్రెడ్డి ప్రవర్తన మార్చుకోవాలని, లేదంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మనుగడ కష్టమని, అందరినీ కలుపుకొని పోవడంలో రేవంత్రెడ్డి విఫలమవుతున్నారని మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ విమర్శించారు. కంటోన్మెంట్ అసెంబ్లీ, మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గాలకు కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా బుధవారం నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ వ్యతిరేకులు, ఉద్యమ ద్రోహులు, తెలుగుదేశం, కాంగ్రెస్ చేతుల్లో ఈ ప్రభుత్వముందని మండిపడ్డారు. తెలంగాణ కోసం పోరాడినవాళ్లను వదిలి ఇతర పార్టీల నుంచి వచ్చినవారికి కాంగ్రెస్ పార్టీ సీట్లు కేటాయించడం సరికాదన్నారు. ఎస్సీలకు లోక్సభ సీట్ల కేటాయింపులో అన్యాయం జరిగిందన్నారు. సభ్యత్వం లేనివాళ్లను, జెండాలు కూడా మోయనివాళ్లను, పార్టీ నాయకులు, కార్యకర్తలపై దాడి చేసి కేసులు పెట్టిన వాళ్లను రాత్రికి రాత్రి తీసుకొచ్చి ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ఓటమి అంచున ఉన్నదని, అధినాయకత్వం పట్టించుకోకుంటే తానే ఐదేండ్లలో రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తానని చెప్పారు.