వనపర్తి, మార్చి 24 (నమస్తే తెలంగాణ) : పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును రెండున్నరేండ్లుగా కాంగ్రెస్ సర్కార్ పడావు పెట్టిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ డెడ్‌స్టోరేజ్ వరకు నీటిని పంపింగ్ చేయొచ్చనే ఉద్దేశంతోనే ఇక్కడ ఎత్తిపోతలను నిర్మించినట్టు తెలిపారు. ఒకవేళ జూరాల నీటి ఆధారంతో చేపడితే సాగునీరు అనుకున్నంత స్థాయిలో తీసుకోవడం సాధ్యపడేది కాదని చెప్పారు. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి 45 రోజుల్లో 90 టీఎంసీల నీటిని తీసుకునే అవకాశం ఉన్నదని, ఎలాంటి నీటి వనరులు లేనిచోట ఈ లిఫ్ట్‌ను ఏర్పాటు చేయాలని అవగాహన లేకుండా కోరడం సరికాదని అన్నారు. మంగళవారం వనపర్తి-నాగర్‌కర్నూల్ జిల్లాల సరిహద్దులోని ఎంజీకేఎల్ఐ లిఫ్ట్-3 పరిధిలోని గుడిపల్లి రిజర్వాయర్‌ను, మిషన్ భగీరథ పథకం ప్లాంట్‌ను రైతులు, బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరిశీలించారు. అనంతరం నిరంజన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కృష్ణా బేసిన్ పరిధిలో ఉమ్మడి పాలమూరుతోపాటు నల్లగొండ, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాలకు కృష్ణా ద్వారా సాగు, తాగునీటిని అందించాలన్న లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర తొలి సీఎం కేసీఆర్ పనిచేశారని గుర్తుచేశారు.పాలమూరు ప్రాజెక్టు పరిధిలోని ఆయకట్టుకు సైతం ఇప్పటివరకు సాగునీరు అందుతుండగా.. జూరాల ఆయకట్టుకు మాత్రం క్రాప్ హాలిడే ప్రకటించారని దుయ్యబట్టారు.
అసంపూర్తిగా ఉన్న ఎంజీకేఎల్ఐని బీఆర్ఎస్ హయాంలో రూ.3 వేల కోట్లు వెచ్చించి వినియోగంలోకి తీసుకొచ్చామని, దీంతో ఇప్పుడు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో దాదాపు 5 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని నిరంజన్‌రెడ్డి తెలిపారు. మరో 35 లక్షల ఎకరాల సాగుభూమి ఉన్నదని, ఈ భూములకు సాగునీరు ఇచ్చేందుకు శ్రీశైలం రిజర్వాయర్ నుంచి నీటి సేకరణ కోసం చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. 27 వేల ఎకరాల భూసేకరణ, రూ.32వేల కోట్లతో పాలమూరు ఎత్తిపోతల పనులు చేసి రూ.27 వేల కోట్ల బిల్లులు చెల్లించినట్టు చెప్పారు. అన్ని ప్రాంతాలకు సాగునీరు అందించాలని కోరారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ వనపర్తి జిల్లా అధ్యక్షుడు గట్టు యా దవ్, అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ పాల్గొన్నారు.