హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాన్ని ముందే ఊహించిన మంత్రులు గ్రామసభలకు రాకుండానే పారిపోయారని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి విదేశీ టూర్లో ఉండగా, మంత్రులు ఇతర రాష్ర్టాల్లో తిరుగుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం ప్రారంభమైన గ్రామసభల్లో ప్రజాగ్రహం వెల్లువెత్తుతుందని చెప్పారు. హామీల అమలుపై అధికారులను ప్రజలు నిలదీస్తున్నారని, ప్రజా నిరసనను వారు తట్టుకోలేకపోతున్నారని తెలిపారు. హైదరాబాద్ తెలంగాణభవన్‌లో మంగళవారం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, రాష్ట్ర కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు రవీందర్‌సింగ్, దూదిమెట్ల బాలరాజ్యాదవ్ కలిసి మీడియాతో మాట్లాడారు.
ప్రజాపాలనలో, ఆన్లైన్లో, సమగ్ర సర్వేలో ఇచ్చిన దరఖాస్తులు ఏమయ్యాయని ప్రజలు నిలదీస్తున్నారని చెప్పారు. ప్రజలకు అధికారులు సమాధానాలు చెప్పలేని పరిస్థితులు తలెత్తాయని, రాష్ట్రమంతా గందరగోళంగా మారిందని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో 66.47 లక్షల రేషన్‌కార్డులు ఇస్తే, అసలే ఇవ్వలేదని కాంగ్రెస్ మంత్రులు అబద్ధాలాడుతున్నారని మండిపడ్డారు. రేషన్‌కార్డులు ఎలా తగ్గించాలనేదే కాంగ్రెస్ ప్రభుత్వ ఆలోచనగా ఉన్నదని తెలిపారు. రేషన్‌కార్డుల కోసం ఎన్నిసార్లు దరఖాస్తులు తీసుకుంటారని, కాలయాపన కోసమే దరఖాస్తుల పేరిట నాటకాలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రేషన్‌కార్డులపై నిబంధనలు సరళతరం చేసి అర్హులందరికీ వెంటనే జారీచేయాలని డిమాండ్ చేశారు.
దళితులకిచ్చిన హామీల అమలేది?
రాష్ట్రంలోని దళితుల సంక్షేమానికి రేవంత్‌రెడ్డికి ఏమాత్రం శ్రద్ధ లేదని కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. చేవెళ్ల ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌లో ఎన్నో హామీలు ఇచ్చారని, ఒకటి కూడా అమలు కాలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. రేవంత్ మంత్రివర్గంలో దళితులకు సరైన ప్రాతినిధ్యమే లేదని, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ సరిగా అమలు కావడం లేదని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీలకు రక్షణ చట్టం-2017 చట్టం ప్రకారం 5 వేల మందికి ఇవ్వాల్సిన రూ.45 కోట్ల పరిహారాన్ని ఎందుకివ్వడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. చేవెళ్ల దళిత డిక్లరేషన్‌ను వెంటనే అమలుచేసి కాంగ్రెస్ ప్రభుత్వం తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు.