Koppula Eshwar | హైదరాబాద్ : అనునిత్యం ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతున్నందుకే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కాంగ్రెస్ సర్కారు కక్ష సాధిస్తున్నది అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. ఫార్ములా- ఈ రేస్ కేసులో గవర్నర్ కేటీఆర్ ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇవ్వడం కక్ష సాధింపు చర్య అని ధ్వజమెత్తారు.
సీఎం రేవంత్‌రెడ్డి ప్రతీకార రాజకీయ దాడిలో భాగంగా కేటీఆర్‌పై ఈ కార్ రేస్ కేసును తెరపైకి తెచ్చాడని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. కేంద్రంలోని బీజేపీతో చీకట్లో చేతులు కలిపి బీఆర్ఎస్పై కాంగ్రెస్ కుట్రలు చేస్తున్నారని, ఫార్ములా ఈ కేసులో చట్టపరమైన స్థిరత్వం, వాస్తవ ఆధారాలు, సాక్ష్యాలు లేవు, ఫార్ములా ఈ రేస్‌పై గతంలో లైడిటెక్టర్ టెస్ట్‌కు సిద్ధమని కేటీఆర్ చేసిన సవాల్‌కు రేవంత్ రెడ్డి తోకముడిచాడని ఆరోపించారు.
రెండేండ్లుగా ఫార్ములా ఈ రేస్‌పై విచారణ పేరిట సాగదీస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం సాధించింది ఏమీ లేదని ఆయన అన్నారు. స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ను నిలువరించేందుకు మరోసారి ఈ-కార్ రేస్ కేసు పేరిట కుట్రలను తెరపైకి తెచ్చిందని హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచిన కేటీఆర్‌పై రేవంత్‌రెడ్డి అక్రమ కేసులు బనాయించి ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా పెట్టుకుని రెండు జాతీయ పార్టీలు పని చేస్తున్నాయని ఆరోపించారు. కేటీఆర్‌ను ప్రజాక్షేత్రంలో ఎదుర్కొనే దమ్ములేకే కుట్రలకు తెగబడుతున్నాయని మాజీ మంత్రి మండిపడ్డారు.
దేశంలో కాంగ్రెస్, బీజేపీలు కేంద్రంలో బద్ధ శత్రువులు కానీ, తెలంగాణలో మాత్రం వారిది అన్నదమ్ముల అనుబంధం అని అన్నారు. ప్రాంతీయ పార్టీలను, యువ నాయకత్వాన్ని రాజకీయంగా నిర్మూలించడం, ప్రాంతీయ పార్టీలను బలహీనపరచడమే జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ ఎజెండా అని ఆరోపించారు. నిన్నటికి నిన్న బీహార్‌లో ఆర్జేడీని కాంగ్రెస్, బీజేపీలు కలిసి మట్టికరిపించాయని, అలాగే యూపీలో సమాజ్‌వాదీ పార్టీని, కర్ణాటకలో జేడీఎస్‌ను, ఢిల్లీలో ఆప్‌ను, మహారాష్ట్రలో ఎన్సీపీ, శివసేనలను ఇంకా అనేక ప్రాంతీయ పార్టీలను పూర్తిగా బలహీన పరిచాయని గుర్తు చేశారు.
దేశంలో యువ నాయకత్వం ఎదుగుదలను నిరోధించడమే మోదీ-బీజేపీల ఎజెండా. అందుకే అఖిలేష్ యాదవ్, తేజస్వీ యాదవ్, కేటీఆర్, ఉదయనిధి స్టాలిన్ వంటి యువ నేతలను బీజేపీ టార్గెట్ చేసిందని, ఉత్తరాదిలో అనుసరించిన వ్యూహాన్నే తెలంగాణలోనూ బీజేపీ-కాంగ్రెస్ పార్టీలు అనుసరిస్తున్నాయని, అందులో భాగంగానే తెలంగాణలో కేసీఆర్ కుటుంబాన్ని ఇబ్బందులు పెట్టేందుకు జాతీయ స్థాయిలో బద్ధ విరోధులు ఆప్తమిత్రులు అయ్యారు. దర్యాప్తు సంస్థలను గుప్పిట్లో పెట్టుకొని బీఆర్ఎస్ నేతలపై రాజకీయ ప్రేరేపిత కేసులు పెడుతున్నారు. ఈ క్రమంలోనే ఫార్ములా ఈ- రేస్‌ను పదే పదే తెరపైకి తెస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ పేరుతో కేసీఆర్‌ను వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
స్థానిక ఎన్నికల నేపథ్యంలోనే రేవంత్, బీజేపీలు కలిసి మళ్లీ ఈ-కార్ రేస్‌ను తెరపైకి తీసుకువచ్చారని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేసింది. 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని నమ్మించి గొంతుకోసింది. ఇచ్చిన హామీని తుంగలో తొక్కి, మాటమార్చి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యం కాదని తేల్చేసింది. రాజ్యాంగబద్ధంగా కాకుండా, పార్టీ పరంగా బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని బీసీ సమాజాన్ని తడిగుడ్డతో గొంతుకోసింది కాంగ్రెస్ ప్రభుత్వం. అటు బీసీ రిజర్వేషన్ల కోసం బీఆర్ఎస్ పార్టీ ప్రత్యక్ష పోరాటం చేస్తున్నది. అందుకే డైవర్షన్ రాజకీయాలు, డ్రామాల పాలిటిక్స్‌కు స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఈ-రేస్‌ను తెరపైకి తీసుకువచ్చారని అన్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ద్రోహంపై, రేవంత్ నయవంచక పాలనపై ప్రజల్లో చర్చ జరగకుండా మీడియా అటెన్షన్ మొత్తం ఈ-రేస్ చుట్టే ఉండాలని రేవంత్ కుట్రలు చేస్తున్నాడని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.