Jagadish Reddy | హైదరాబాద్ : 2004 నుంచి 2014 వరకు స్వర్ణ యుగమట.. కొంచెమన్న సిగ్గుండాలి రేవంత్ రెడ్డికి మాట్లాడడానికి అని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ధ్వజమెత్తారు. 2004 -14 దేనికి స్వర్ణయుగం? స్మశానాలకు స్వర్ణయుగం కాదా..? అని ప్రశ్నించారు. తెలంగాణ భవన్లో జగదీశ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
టీడీపీ, కాంగ్రెస్ పాలనలో పాలమూరులో ఆకలి చావులు చోటు చేసుకున్నాయి. ఎకరాలు భూములు ఉన్నా వనరులు లేక అడుక్కుతింటూ చంద్రబాబు పాలనలో బస్టాండ్లలో చనిపోయారు. పాలమూరు జిల్లా నాశనం కావడానికి చంద్రబాబే కారణం కదా.. అలాంటి వారి పాలన నీకు నచ్చింది. కొంచెమన్న సోయి ఉండాలి. నల్లగొండ జిల్లాకు ఫ్లొరైడ్ తెచ్చిందేవరు..? ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల నుంచి లక్షలాది మంది దుబాయ్ ఇతర ప్రాంతాలకు వెళ్లి వలస బతుకు బతుకుతున్నది మీ పార్టీల వల్లే కదా.. సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నవ్. కేసీఆర్ వచ్చిన తర్వాత ఏం జరగలేదు అని అంటున్నవ్. దేశంలో 1000 గురుకుల పాఠశాలలు ఉన్న రాష్ట్రం తెలంగాణ మాత్రమే. కార్పొరేట్ స్థాయి విద్యతో పోటీ పడి కేసీఆర్ చదువును అందించారు అని జగదీశ్ రెడ్డి గుర్తు చేశారు.
ఈ రెండేండ్ల కాలంలో రేవంత్ రెడ్డి ఒక కొత్త పాఠశాల ప్రారంభించారా..? కొత్త ప్రాజెక్టును ప్రారంభం చేశారా..? హైదరాబాద్లో కొత్త వంతెనను ప్రారంభం చేశావా..? మేం నిర్మాణం చేసి పూర్తి చేస్తే.. ప్రారంభం చేస్తున్నవ్. అది కేసీఆర్, కేటీఆర్ నిర్మించిందని యాది చేసుకో. హైదరాబాద్ నగర అభివృద్ధి కొరకు ఇప్పటి వరకు రూ. 5 అయినా ఇచ్చావా..? హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీని నీ తాతలు పెంచారా..? తెలంగాణను ప్రపంచానికి పరిచయం చేసింది కేసీఆర్, కేటీఆర్ కదా.. తప్పకుండా కేసీఆర్ పదేండ్ల పాలనకు, నీ రెండేండ్ల పాలకు రెఫరెండం అని ఒక్క సభలోనైనా చెప్పాల్సి ఉండే. కేటీఆర్ అభివృద్ధి చూసి ఓటేయమని అంటున్నారు. మరి నువ్వెందుకు అడగడం లేదు అని రేవంత్ రెడ్డిని జగదీశ్ రెడ్డి నిలదీశారు.
కేసీఆర్, కేటీఆర్ చేసిన పనులు ప్రజలు చెప్పుకుంటున్నరు. చర్చించుకుంటున్నరు. సిగ్గుండాలి 24 గంటల కరెంటు ఇచ్చానని దాంతో హైదరాబాద్కు పెట్టుబడులు వచ్చాయి అని చెప్పడానికి. కేసీఆర్ రాక ముందు, వచ్చిన తర్వాత తెలంగాణ ఎట్ల ఉండే అని చర్చించుకోవాలి. కరెంట్ కోసం పారిశ్రామికవేత్తలు ధర్నా చేశారు కాంగ్రెస్ పాలనలో. ఇందిరా పార్కు వద్ద నువ్వు కూడా మాట్లాడావు కరెంట్ ఇవ్వకపోతే. వారానికి మూడు రోజులు కరెంట్ ఇవ్వకుండా చేసి వ్యవసాయ రంగాన్ని, పారిశ్రామిక రంగాన్ని నాశనం చేశారు. ప్రజలు వలసలు వెళ్లేలా చేశారు. ఆకలి చావులకు గురి చేశారు. చేనేత కార్మికులు మీ దుర్మర్గాల వల్లే చనిపోయారు అని జగదీశ్ రెడ్డి గుర్తు చేశారు.
60 వేల కోట్లు మిగులు బడ్జెట్తో కేసీఆర్కు రాష్ట్రం అప్పగించారు అంటావా? నీకు చదువు రాకపోతే తెలిసిన వాళ్ళను అడుగు. అప్పటి బడ్జెట్ కూడా అంత లేదు. కేసీఆర్ సీఎం అయ్యే నాటికే మిగులు 300 కోట్లు. దిగిపోయే నాటికి 5 వేల కోట్లు మేము మిగులు బడ్జెట్తో రాష్ట్రాన్ని అప్పజెప్పాం. కేసీఆర్ హయంలో ప్రపంచంలో తెలంగాణ చిత్ర పటంలోనే లేదట. ఇంతకన్నా అబద్దం మరొకటి ఉంటుందా..? ఉమ్మడి రాష్ట్రంలో 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండేది. కేసీఆర్ ప్రయత్నాల వల్ల 2019లోనే 2 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండింది అని జగదీశ్ రెడ్డి వివరించారు.