Harish Rao | హైదరాబాద్ : ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రారంభించిన 150 బెస్ట్ అవెలబుల్ స్కూళ్లకు (BAS) కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడం శోచనీయం అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు. గత రెండేండ్లుగా పెండింగ్‌లో ఉన్న నిధులను తక్షణమే విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి హరీశ్‌రావు లేఖ రాశారు.
మీ ప్రభుత్వ నిర్లక్ష్యం విద్యార్థులకు, యాజమాన్యాలకు పెను శాపంగా మారింది. సరైన భోజనం, వసతి, ఇతర సౌకర్యాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటుంటే, యాజమాన్యాలు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాయి. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా మిత్తికి పైసలు తెచ్చి, ఇంట్లో ఉన్నబంగారం బ్యాంకుల్లో తాకట్టు పెట్టి స్కూళ్లు నడుపుతున్నారు. తెచ్చిన అప్పులు చెల్లించలేక, ఇఎంఐలు కట్టలేక, బ్యాంకర్లకు సమాధానం చెప్పలేక ముఖం చాటేయాల్సిన పరిస్థితి వారికి వచ్చింది. అప్పుల భారం భరించలేక వనపర్తిలో ఒక పాఠశాల యజమాని ఆత్మహత్యాయత్యం చేసుకున్నడు. ఇంత జరుగుతుంటే మీ ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేకపోవడం దుర్మార్గం. విద్యకు అధిక ప్రాధాన్యం అని మీరు చెప్పే మాటలు నోటి మాటలేనని మీ నిర్లక్ష్య వైఖరి స్పష్టం చేస్తున్నది అని హరీశ్‌రావు మండిపడ్డారు.
2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేరు కూడా మార్చకుండా, రాజకీయాలు చేయకుండా కొనసాగించిన పథకాల్లో ఇది ఒకటి. పేద విద్యార్థులకు మంచి విద్యను అందించే ఈ స్కీమ్‌ను యధావిధిగా కొనసాగించాలని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. పాఠశాలల సంఖ్యను 80 నుంచి 150కి పెంచుతూ 8 వేల మంది విద్యార్థులకు అవకాశముండే ఈ పథకాన్ని 25 వేల మంది విద్యార్థులు ప్రతి ఏటా చదువుకునే విధంగా విస్తరించారు. అంతేకాక ప్రతి విద్యార్థి మీద ఖర్చు చేసే నిధులను కూడా రూ. 8000 నుండి రూ. 20వేలకు డే స్కాలర్ విద్యార్థులకు, రూ. 20వేల నుండి రూ. 42 వేలకు హాస్టల్ విద్యార్థులకు పెంచుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గడిచిన తొమ్మిదిన్నర సంవత్సరాల్లో సకాలంలో నిధులు కేటాయించి, విడుదల చేసి ఈ పథకానికి ఎలాంటి ఆటంకం కలగకుండా వేల మంది విద్యార్థులకు లబ్ధి చేకూర్చింది. ఎంతోమంది విద్యార్థులను దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన విద్యాలయాల్లో ప్రవేశం పొందేలా పాఠశాలల్లోనే ఐఐటి, ట్రిబుల్ ఐటీ విద్యను కూడా బోధించే అవకాశాలు కల్పించింది అని హరీశ్‌రావు గుర్తు చేశారు.
ఈ స్కూళ్లలో చదువుతున్న 25,000 మంది విద్యార్థుల్లో 18,000 మంది ఎస్సీ కేటగిరీకి, 7,000 మంది ఎస్టీ కేటగిరికి చిందిన విద్యార్థులు ఉన్నారు. వీరంతా బడుగు బలహీనవర్గాల పిల్లలే. తమ కుటుంబాలలో చదువుకుంటున్న తొలి తరం వారు, జోగిని వ్యవస్థకు గురైన వారి పిల్లలు, రెక్కాడితేగాని డొక్కాడని కూలీల పిల్లలు ఉన్నారు. ఒక సామాజిక మార్పుకు దోహదం చేయాలనే లక్ష్యంతో ప్రతి సంవత్సరం ఈ పథకం కోసం బిఆర్ఎస్ ప్రభుత్వం రూ. 130 కోట్ల నిధులు విడుదల చేసింది. ముఖ్యమంత్రిగానే కాకుండా, విద్యాశాఖ మంత్రిగా మీరు ఉండి బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకు మంచి భవిష్యత్తును తీర్చిదిద్దే ఈ పథకానికి నిధులు విడుదల చేయకపోవడం అత్యంత బాధాకరం అని హరీశ్‌రావు అన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం 2023 -24 విద్యా సంవత్సరానికి సంబంధించిన రూ. 130 కోట్ల నిధులను కేటాయించడం జరిగింది. ఇందులో మొదటి విడత రూ. 50 కోట్ల నిధులు విడుదలయ్యాయి. రెండో విడత నిధులు విడుదల చేసే సమయానికి ఎన్నికల కోడ్ రావడం వల్ల నిధులు విడుదల చేయలేకపోయాం. ఆ తర్వాత ఏర్పడిన మీ కాంగ్రెస్ ప్రభుత్వం మిగతా రూ. 80 కోట్లను విడుదల చేయకుండా నిర్లక్ష్యం వహించింది. దీంతో పాటు 2024-25 విద్య సంవత్సరానికి సంబంధించిన నిధులను ఇప్పటికీ విడుదల చేయలేదని హరీశ్‌రావు తెలిపారు.
బెస్ట్ స్కూళ్ల ధీనస్థితి గురించి గతేడాది ఆగస్టు నెలలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు లేఖ రాయడం జరిగింది. యాజమాన్యాలు సైతం వివిధ రూపాల్లో వారి ఆవేదనను ప్రభుత్వం దృష్టికి తెస్తూనే ఉన్నారు. అయినా పట్టించుకునే నాథుడే లేకుండా పోయిండు. నిధులు విడుదల కాక పాఠశాలలు అయోమయ పరిస్థితిలో ఉన్నాయి. పాఠశాలల్లో చదువుతున్న 25 వేల మంది పేద విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికైనా మీరు స్పందించి, ఎంతోమంది పేద, బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు భవిష్యత్తును ఇచ్చే పథకాన్ని నీరుగార్చకుండా కొనసాగించాలని కోరుతూ.. రెండు సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామని హరీశ్‌రావు పేర్కొన్నారు.