సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తానని మాటిచ్చినవ్. ఏడాది నుంచి అది నీటి మూటగానే మిగిలిపోయింది. రేవంత్‌రెడ్డీ.. నీది నోరా? మోరా? అబద్ధాలతో పబ్బం గడుపుడు తప్ప ఏడాదిలో ఏ ఒక్క హామీ అయినా నెరవేర్చినవా? సమగ్ర శిక్ష ఉద్యోగులు చేస్తున్న సమ్మెతో కొన్ని రోజులుగా విద్యార్థులు రోడ్డుపై పడ్డా నీకు దున్నపోతు మీద వానపడ్డట్టే ఉన్నది. కనీసం వారిని పిలిచి మాట్లాడే సోయిలేదా? – హరీశ్‌రావు
మెదక్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ)/హనుమకొండ/ వరంగల్ చౌరస్తా : రేవంత్ పాలనలో ఒర్రుడే తప్ప ఏవర్గానికీ ఓదార్పు లేదని, అడిగిన వాళ్లను అదరగొట్టుడు.. ప్రశ్నిస్తే పగబట్టుడు.. అబద్ధాలతో పబ్బంగడుపుడే రేవంత్‌రెడ్డి తీరు అని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు. చాయ్ తాగినంత సేపట్లో సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు పరిషరిస్తనని నాడు రేవంత్‌రెడ్డి చెప్పిండనీ, ఏడాది గడిచినా ఆయనకు చాయ్ తాగే సమయం దొరకడం లేదని ఎద్దేవాచేశారు. మెదక్, హనుమకొండలో సమగ్ర శిక్ష ఉద్యోగుల దీక్షకు సోమవారం ఆయన సంఘీభావం తెలిపారు.
అంతకు ముందు మెదక్ చర్చి వందేళ్ల ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన, వరంగల్‌లో మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పురోగతిని పరిశీలించారు. హనుమకొండ ఏకశిలా పార్కు వద్ద ఉద్యోగుల దీక్షా శిబిరంలో హరీశ్ చాయ్ తాగి నిరసన తెలుపుతూ ‘చాయ్ తాగడం పూర్తయింది. మరి సమస్యల పరిష్కారం ఏది’ అని రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి ఎద్దేవాచేశారు.
ఏకశిలా పార్కు ఎదుట 2023 సెప్టెంబర్ 13న సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఇచ్చిన మాటను రేవంత్‌రెడ్డి నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు ఇదే స్థలంలో రేవంత్ చెప్పిన మాట ఏడాది దాటినా నీటి మూటగానే మిగిలిపోయిందని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెతో విద్యార్థులు రోడ్డుపై పడ్డారని, ఉద్యోగులను కనీసం పిలిచి మాట్లాడే సోయిలేదా అని రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి ప్రశ్నించారు. ఉద్యోగులు హైదరాబాద్‌లో నిరసన తెలిపితే అరెస్ట్ చేసి ముషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారని గుర్తుచేశారు. ఉద్యోగుల సమస్యపై అసెంబ్లీలో నిలదీశామని, శాసన మండలిలో పిటిషన్ కూడా ఇచ్చామని, సమస్యలు పరిష్కారమయ్యేదాకా బీఆర్ఎస్ వెన్నంటి ఉంటుందని హామీఇచ్చారు. రేవంత్‌రెడ్డి మాట మీద నిలబడితే వ్యక్తే అయితే సర్వశిక్షా అభియాన్ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిషరించాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్‌కు పేరొస్తుందనే..
పేదల వైద్యంపై కాంగ్రెస్ సర్కార్‌కు చిత్తశుద్ధి లేదని హరీశ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. రూ.1100 కోట్లతో వరంగల్ సెంట్రల్ జైల్ స్థలంలో చేపట్టిన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పనులను పరిశీలించిన ఆయన విలేకరుతో మాట్లాడుతూ పనుల్లో పురోగతి కనిపించడం లేదని తెలిపారు. వరంగల్ నగరానికి తలమానికంగా ఇక్కడ కేసీఆర్ హయాంలో హెల్త్ సిటీ నిర్మాణం చేపట్టారని, పేదల ఆరోగ్యాన్ని కాపాడాలనే చిత్తశుద్ధితో హైదరాబాద్ నగరానికి నాలుగు వైపులా 2 వేల పడకల సామర్థ్యం కలిగిన హాస్పిటళ్ల నిర్మాణంతో పాటు వరంగల్ అభివృద్ధికి చిహ్నంగా నిలిచేలా సింగిల్ టవర్ హాస్పిటల్ నిర్మాణానికి పూనుకున్నామని వివరించారు. 150 పడకలతో ఎమర్జెన్సీ వైద్యసేవలు, 2 వేల పడకల సామర్థ్యం, 33 ఆపరేషన్ థియేటర్లు, 14 అంతస్థుల్లో వైద్య సేవలు, మిగిలిన పది అంతస్థుల్లో పరిపాలనా విభాగం, పీజీ వైద్యులకు వసతి, ల్యాబ్‌లు, లైబ్రరీలు, బ్లడ్ బ్యాంకు ఇలా సకల సౌకర్యాలతో నిర్మాణం చేపట్టామని గుర్తుచేశారు. ముందుగా 16.50 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కట్టాలని అనుకున్నా.. కేసీఆర్ సూచనలతో సుమారు 20 లక్షల 50 వేల చదరపు అడుగుల విస్తీర్ణానికి పెంచామని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలోనే దాదాపు 84శాతం పనులు పూర్తయ్యాయని తెలిపారు. ఇది పూర్తయితే కేసీఆర్‌కు పేరు వస్తుందన్న కుట్రతోనే మిగిలిన పనులు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నదని మండిపడ్డారు. 2023 అక్టోబర్ 23న హాస్పిటల్‌ను సందర్శించిన సమయంలో పనుల్లో వేగం పెంచి 2024 జూన్ 2 రాష్ట్ర అవతరణ దినోత్సవం నాటికి పూర్తి చేసి ప్రారంభించాలని నిర్ణయించినట్టు తెలిపారు. కాంగ్రెస్ వచ్చి 14 నెలలు గడిచినా మిగిలిన 16 శాతం పనులను కూడా పూర్తి చేయలేకపోయిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. హాస్పిటల్‌ను వెంటనే ప్రజలకు అందుబాటులోకి తేకుండా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.
జైపూర్‌లో ఉండొచ్చు.. తెలంగాణలో వద్దా?
వరంగల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై హరీశ్‌రావు మండిపడ్డారు. ‘హాస్పిటల్ నిర్మాణం అంత ఎత్తు ఉంటుందా అని ముఖ్యమంత్రి మాట్లాడటం సరికాదు. హాస్పిటల్ అవసరాలకు జీ ప్లస్ 13 ఫ్లోర్లు మాత్రమే వినియోగిస్తరు. మిగిలిన 10 అంతస్థుల్లో వైద్యుల వసతి, లైబ్రరీ, ల్యాబ్‌లు, బ్లడ్ బ్యాంకు, పరిపాలనా విభాగం, వైద్యాధికారుల కార్యాలయాలు ఉంటయ్. జైపూర్‌లో కాంగ్రెస్ పాలన ఉన్నప్పుడు 110 మీటర్ల ఎత్తుతో 24 అంతస్థుల హాస్పిటల్ నిర్మాణం చేపట్టింది. ప్రస్తుత ప్రభుత్వం దాన్ని పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. దానితో పోల్చితే వరంగల్ హాస్పిటల్ 19 మీటర్ల వరకు ఎత్తు తక్కువే. ఇప్పటికైనా అభాండాలు వేయడం మాని పనుల్లో వేగం పెంచాలి’ అని హరీశ్ చురకలంటించారు.
తొక్కుకుంటూ వచ్చినోళ్లు నిలబడలేరు
కార్యకర్తలు, నాయకులను తొక్కుకుంటూ వచ్చిన నాయకుడు నిలదొక్కుకోలేడని హరీశ్ విమర్శించారు. తరాల నుంచి కాంగ్రెస్‌లో ఉన్న నాయకులను తొక్కుకుంటూ వచ్చిన రేవంత్‌రెడ్డి, తెలంగాణ పేదల సంక్షేమాన్ని సైతం తొక్కేస్తున్నాడని నిప్పులుచెరిగారు. ప్రజాసంక్షేమాన్ని మరచి కాంగ్రెస్ ప్రభుత్వం కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నదని దెప్పిపొడిచారు.
ఏ వర్గానికైనా ఓదార్పు ఉన్నదా?
‘రేవంత్ పాలనలో ఏవర్గానికీ ఓదార్పు లేదు.. సమగ్ర శిక్ష ఉద్యోగులే కాకుండా ఏవర్గం వారు ఆందోళన చేసినా వారికి నచ్చచెప్పిండా? హామీ లు తీరుస్తమని ఓదార్చిండా’ అని హరీశ్ నిలదీశారు. మెదక్ బీఆర్ఎస్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ వచ్చిన తర్వాత క్రైస్తవులకు ఇచ్చే గిఫ్టులను కూడా ఇవ్వకుండా అన్యాయం చేసిందని మండిపడ్డారు. క్రిస్మస్ పండుగను అధికారికంగా జరిపిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అని, తొలిరాష్ట్రం తెలంగాణ అని గుర్తుచేశారు. బాక్సింగ్ డేను కూడా సెలవు దినంగా ప్రకటించి, క్రిస్మస్కు రెండు సెలవు దినాలిచ్చిన ఏకైక నాయకుడు కేసీఆర్ అని చెప్పారు. ‘రేవంత్‌రెడ్డి వచ్చిన తర్వాత బతుకమ్మ చీరలు, రంజాన్ తోఫా బంద్ హోగయా, క్రిస్మస్ కా బీ తోఫా బంద్ హోగయా’ అని ఎద్దేవా చేశారు.
ఏడాదిలో 41శాతం పెరిగిన క్రైం రేట్
రాష్ట్రంలో ఎవరికీ శాంతి లేదని, భద్రత లేదని హరీశ్‌రావు వాపోయారు. పోలీసులు తమ పని తాము చేయలేక రాష్ట్రంలో క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగిందని, రికవరీ రేటు తగ్గిందని చెప్పారు. ‘ఎంతసేపూ ప్రతిపక్షాల మీద, వారి అణచివేత మీద, అక్రమ కేసుల మీద, మా మీద నిఘా పెట్టడం మీదనే నీ పాలన నడుస్తున్నది. ఏం జరిగింది నీ పాలనలో అంటే.. నిన్న హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఏడాది శాంతిభద్రతల రిపోర్ట్ ఇచ్చిండు. కేసీఆర్ పాలనకంటే, రేవంత్ పాలనలో ఏడాదిలో 41 శాతం క్రైమ్ రేటు పెరిగింది. నువ్వు మంచిగ పనిచేసినవా? లేదా? అనడానికి ఈ ఒక ఉదాహరణ చాలదా?’ అని నిలదీశారు. బీఆర్ఎస్ పాలనలో ఏడాదిలో 25 వేల కేసులు నమోదైతే రేవంత్ పాలనలో ఏడాదిలోనే 35 వేల కేసులు నమోదయ్యాయని, అంటే 10 వేల కేసులు ఒక హైదరాబాద్ నగరంలోనే పెరిగాయని ఆందోళన వ్యక్తంచేశారు. మర్డర్లు, రేపులు, చైన్ స్నాచింగులు, రాబరీలు, దొంగతనాలు, ల్యాండ్ కేసులు విపరీతంగా పెరిగాయని వాపోయారు.
రైతు ఆత్మహత్యలు కలిచివేస్తున్నయ్
‘పంట రుణమాఫీపై బ్యాంకర్ల మీటింగులో రూ.49 వేల కోట్లన్నడు. బడ్జెట్లో రూ.26 వేల కోట్లన్నడు. చివరకు 17 వేల కోట్లు అని చెప్పి 12 వేల కోట్లే ఇచ్చిండు. మహబూబ్‌నగర్‌లో 2,750 కోట్ల రుణమాఫీ చేసిన అన్నడు. ఏదీ ఇంకా వేయలే కదా? రూ.2 లక్షల పైన అప్పున్నోళ్లు జల్ది కట్టున్రి అన్నడు. రైతులు అవి కడితిరి. ఈ మిత్తి, ఆ మిత్తి ఏమై పోవాలె? పొద్దున పేపర్ చూస్తే అప్పుల బాధతో ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నరు. ఆ వార్త కలిచివేసింది. మెదక్ జిల్లాలో కూడా ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నడు. రేవంత్ పాలనలో నాలుగైదు వందల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నరు. కాంగ్రెస్ వచ్చినంక రైతుల పరిస్థితి దారుణంగా తయారైంది’ అని హరీశ్ ఆవేదన వ్యక్తంచేశారు.
నీ సోదరుడిని ఎందుకు అరెస్ట్ చేయరు?
‘నటుడు అల్లు అర్జున్ను అరెస్టు చేసినవు సరే.. కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ సాయిరెడ్డి ఆత్మహత్యకు కారణమైన నీ సోదరుడు తిరుపతిరెడ్డిని కూడా అరెస్టు చేయాలికదా? ఎందుకు అరెస్ట్ చేయించడం లేదు? చట్టం కాంగ్రెస్ పార్టీకి చుట్టమైందా? 54 మంది హాస్టల్ విద్యార్థులు మరణిస్తే పట్టించుకోవడం లేదు. ఇదేనా ప్రజాపాలనా? లగచర్ల రైతులకు బేడీలు వేస్తే ప్రజాపాలనా?’ అని హరీశ్ నిలదీశారు. మెదక్‌లో జరిగిన కార్యక్రమాలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్‌రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ ్లశ్రీనివాస్, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ చంద్రాగౌడ్, ఏఎంసీ మాజీ చైర్మన్లు భట్టి జగపతి, ఆకిరెడ్డి కృష్ణారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ ఆరెళ్ల మల్లికార్జున్‌గౌడ్, వరంగల్‌లో జరిగిన కార్యక్రమాల్లో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, నన్నపునేని నరేందర్, శంకర్‌నాయక్, మాజీ చైర్మన్లు వెంకటేశ్వర్లు, మర్రి యాదవరెడ్డి పాల్గొన్నారు.
నమ్మి ఓటేసిన ప్రజలకు గాడిద గుడ్డు మిగిలింది
‘బీఆర్ఎస్ పదేండ్లలో 4 లక్షల 17 వేల కోట్ల అప్పుచేస్తే, రేవంత్ ఒక ఏడాదిలోనే లక్షా 27 వేల కోట్ల అప్పు చేసిండు. బడా కాంట్రాక్టర్ల దగ్గర పర్సంటేజీలు తీసుకొని బిల్లులిచ్చిండు. ఒక గ్యారెంటీని కూడా అమలు చేయలేదు. ఒక్క పథకం ఇచ్చింది లేదు. ఉన్న పథకాలను కూడా బంద్ చేసినవ్. నిన్ను నమ్మి ఓటేసిన ప్రజలకు గాడిద గుడ్డే మిగిలింది’ అని హరీశ్ ఎద్దేవాచేశారు. ఇచ్చిన మాట ప్రకారం రైతులందరికీ ఎకరాకు వానకాలం రూ. 7500, యాసంగి రూ.7500 కలిపి రూ.15 వేల చొప్పున రైతుభరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ‘కాంగ్రెస్ వస్తే రైతుబంధు బంద్ అవుతదని కేసీఆర్ ముందే చెప్పిండు. అప్పుడేమో అట్ల బందు పెట్ట.. రైతుబంధు ఇస్త.. నేనేమన్న దివాణా గాన్నా అన్నడు. ఇవాళ ఎవరు దివాణా గాడో మీరే చెప్పాలె’ అంటూ దుయ్యబట్టారు. ‘దమ్ముంటే గన్మెన్లను వదిలేసి 25న ఏ ఊరికైనా పోదాం.. వందశాతం రుణమాఫీ కాలేదని నిరూపిస్త.. నువ్వు ముక్కు నేలకు రాస్తవా రేవంత్’ అని సవాల్ చేశారు. ఏడుపాయల అమ్మవారి మీద, మెదక్ చర్చి మీద, జహంగీర్ పీర్ దర్గామీద కూడా ఒట్టుపెట్టి రుణమాఫీపై రేవంత్‌రెడ్డి మాట తప్పారని, ఇప్పటికైనా ప్రాయశ్చిత్తం చేసుకోవాలని సూచించారు.
రుణమాఫీ అంతా అయిపోందంటున్న రేవంత్‌రెడ్డీ.. నేను చాలెంజ్ చేస్తున్న. గన్మెన్లను వదిలేసి ఏ ఊరికైనా పోదాం పా.. 25వ తారీఖున ఏ ఊరికి పోయేందుకైనా నేను సిద్ధం. వందశాతం రుణమాఫీ పూర్తికాలేదని నిరూపిస్త.. నువ్వు ముక్కు నేలకు రాస్తవా? ఏడుపాయల అమ్మవారి మీద ఒట్టుపెట్టి మాట తప్పినవ్. మెదక్ చర్చి మీద ఒట్టుపెట్టి మాట తప్పినవ్. ఇప్పుడు ఏం ముఖం పెట్టుకొని సిగ్గులేకుండా మెదక్‌కు వస్తున్నావ్?
-హరీశ్‌రావు
వరంగల్ నగరానికి తలమానికంగా కేసీఆర్ హెల్త్ సిటీ నిర్మాణం చేపట్టిండ్రు. రూ.1100 కోట్లతో మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం మొదలు పెట్టి దాదాపు 84శాతం పనులు పూర్తిచేసిండ్రు. నిర్మాణం పూర్తయితే బీఆర్ఎస్కు, కేసీఆర్‌కు పేరొస్తుందన్న కుట్రతోనే 14 నెలలు గడిచినా మిగిలిన 16 శాతం పనులను కూడా రేవంత్ సర్కార్ పూర్తిచేయలేదు. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం.
-హరీశ్‌రావు