Harish Rao | హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు దివ్యాంగుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుంది అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు స్పష్టం చేశారు. ఈనెల 26వ తేదీన దివ్యాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహాధర్నా కార్యక్రమానికి రావాల్సిందిగా హరీశ్‌రావును దివ్యాంగుల పోరాట సమితి ప్రతినిధులు కోరారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే దివ్యాంగులకు రూ. 4 వేల పెన్షన్ నుంచి రూ. 6 వేలకు పెంచుతామని హామీ ఇచ్చి ఇప్పటివరకు నెరవేర్చకపోవడం దుర్మార్గమని దివ్యాంగుల పోరాట సమితి ప్రతినిధులు మండిపడ్డారు. పెన్షన్ పెంపుతో పాటు తమ 11 డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని అందుకు బీఆర్ఎస్ పార్టీ పక్షాన మద్దతు ఇవ్వాలని కోరిన దివ్యాంగుల పోరాట సమితి ప్రతినిధులు కోరారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. దేశంలో దివ్యాంగుల సంక్షేమం కోసం ఆలోచించిన ఏకైక నాయకుడు కేసీఆర్. రూ. 500 పెన్షన్‌ను రూ. 4 వేలు చేసి దివ్యాంగుల ఆత్మవిశ్వాసాన్ని పెంచారు. ఎన్నికల్లో రూ. 3 వేల పెన్షన్ చేస్తామని హామీ ఇచ్చి రూ. 4 వేల పెన్షన్ ఇచ్చి దివ్యాంగులపై తన ప్రేమను చాటుకున్నారు కేసీఆర్. దేశంలో దివ్యాంగులకు రూ. 4 వేల పెన్షన్ ఇచ్చిన ఏకైక నాయకుడు కేసీఆర్, ఏకైక రాష్ట్రం తెలంగాణ. రాష్ట్ర ఏర్పాటు తర్వాత రాష్ట్ర అభివృద్ధిలో దివ్యాంగుల పాత్ర కూడా ఉండాలని కేసీఆర్ అందుకు అనుగుణంగా ప్రోత్సహించారని హరీశ్‌రావు గుర్తు చేశారు.
కుటుంబాలకు దివ్యాంగులు భారం కాదని బలమని కేసీఆర్ నిరూపించారు. రూ 4 వేల పెన్షన్ అందించడంతో పాటు విద్యా ఉపాధి అవకాశాల్లో మెరుగైన అవకాశాలను కల్పించారు. అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను మోసం చేసినట్టే దివ్యాంగులను కూడా నమ్మించి మోసం చేసింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రూ. 4 వేల పెన్షన్‌ను రూ. 6 వేలు చేస్తామని నమ్మించి సంవత్సరం కాలం పూర్తవుతున్నా కనీసం వారి గురించి మాట్లాడకపోవడం శోచనీయం. మీ డిమాండ్లకు బీఆర్ఎస్ పక్షాన మద్దతు ఇవ్వడంతో పాటు అసెంబ్లీ సమావేశాల్లో పెన్షన్ పెంపుతో పాటు 11 డిమాండ్ల పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ఈనెల 26వ తేదీన నిర్వహిస్తున్న చేయూత పెన్షన్ దారుల మహాధర్నా కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ పక్షాన పూర్తి మద్దతు తెలుపుతున్నాము అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
KCR | 9న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ.. కేసీఆర్‌కు ఆహ్వానం
Rasamai Balakishan | రేవంత్ రెడ్డి ఏడాది పాలనపై రసమయి బాలకిషన్ పాట.. వీడియో
Telangana Talli | డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టను ఆపాలని హైకోర్టులో పిటిషన్