Harish Rao | సిద్దిపేట : పాకిస్తాన్లో ఉగ్రవాదులను ఏరి వేయడానికి భారత సైన్యం అద్భుతంగా పోరాటం చేస్తోంది అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రశంసించారు. పహల్గాంలో అమాయకులైన 26 మంది పర్యాటకులను ఉగ్రవాదులు కాల్చి చంపడం కలిచివేసిందన్నారు. సిద్దిపేటలో శ్రీశ్రీశ్రీ దుర్గా ప్రసాద్ స్వామి వారి ఆధ్వర్యంలో శ్రీ సంతోషిమాత దేవాలయంలో 108 హోమ కుండాలతో హనుమాన్ యజ్ఞం నిర్వహించారు. ఈ యజ్ఞంలో హరీశ్‌రావు పాల్గొని ప్రసంగించారు.
ఈ హోమంలో పాల్గొన్న భక్తులందరికీ పేరుపేరునా నమస్కారం. దుర్గాప్రసాద్ స్వామీజీ చేతుల మీదుగా ఈ హోమం సిద్దిపేటలో జరగడం చాలా సంతోషంగా ఉంది. ఉగ్రవాదాన్ని అంతం చేయాలని, భారతదేశంలో శాంతి నెలకొలపాలని దుర్గాప్రసాద్ స్వామీజీ ఆశీస్సులతో చేసే ఈ హోమం ఫలించాలని కోరుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్రం సుఖ సంతోషాలతో ఎల్లప్పుడూ ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. మన సైనికులకు బలాన్ని అందించి, ఉగ్రవాదులపై విజయం సాధించాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను. తెలంగాణలో ఈ భక్తి కార్యక్రమం మొట్టమొదటగా సిద్దిపేటలో ప్రారంభించడం జరిగిందని హరీశ్‌రావు పేర్కొన్నారు.
ముఖ్యంగా యువతను భక్తి మార్గంలో నడిపించడానికి, సక్రమంగా క్రమశిక్షణతో నడిచేందుకు ఈ హనుమాన్ దీక్ష ఉపయోగపడుతోంది. కొంతమంది యువత దీక్ష పట్టిన సమయంలో మండుతున్న ఎండలో చెప్పులు లేకుండా తిరుగుతుంటారు.వారు భక్తి భావాన్ని పెంపొందిస్తున్నారు. ప్రజలు చెడు మార్గాన్ని అనుసరించకుండా, మంచి మార్గంలో వెళ్లడానికి ఇలాంటి వారు స్ఫూర్తిగా నిలుస్తారు. భగవంతుని పూజిస్తూ, తల్లిదండ్రులను పూజిస్తూ, కష్టాన్ని నమ్ముకుని జీవితంలో పైకి రావాలి అని హరీశ్‌రావు అన్నారు.
ఈ రోజు సాయంత్రం సిద్దిపేట క్యాంప్ ఆఫీస్‌లో దుర్గాప్రసాద్ స్వామీజీ ఆధ్వర్యంలో భిక్ష, భజన కార్యక్రమం ఉంది. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మీ అందరినీ కోరుతున్నాను. ప్రతి సంవత్సరం కోమటి చెరువులో తెప్పోత్సవం చేసుకుంటున్నాం. తెప్పోత్సవం అంటే ఎక్కడో విజయవాడలో లేదా ఇంకెక్కడో చూసేవాళ్లం. ఇప్పుడు కాళేశ్వరం నీళ్లతో కోమటి చెరువును నింపి, గోదావరి నీళ్లలో తెప్పోత్సవం చేసుకుంటున్నాం. ఈ సారి కూడా సిద్దిపేట కోమటి చెరువులో అద్భుతంగా తెప్పోత్సవం నిర్వహించుకుందాం అని హరీశ్‌రావు అన్నారు.