Harish Rao | శ్వేత పత్రాలు హామీల ఎగవేతల పత్రాలా? అనే అనుమానం కలుగుతోందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. బీఆర్ఎస్ ఎల్పీలో ఆదివారం చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వందరోజుల్లో గ్యారంటీలను అమలు చేస్తామని ప్రభుత్వం చెబుతోందని, మార్చి 17తో వంద రోజులు పూర్తవుతాయన్నారు. జిల్లాల్లో పర్యటించినపుడు రైతుబంధు ఇంకా తమకు రాలేదని ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ప్రజాపాలనలో దరఖాస్తులు తీసుకుంటున్నారన్నారు. పార్లమెంట్ ఎన్నికలు ముంచుకొస్తున్నాయని, ఫిబ్రవరి నెలాఖరులో షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందన్నారు. కోడ్ వస్తే గ్యారంటీల అమలులో మరింత జాప్యం జరిగే అవకాశం ఉందన్నారు. పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్‌లోపే ఆరు గ్యారంటీల్లోని పదమూడు హామీలు అమలు కావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు.
కోడ్ పేరిట గ్యారంటీల దాటవేత జరుగుతుందా? అనే అనుమానాలున్నాయని హరీశ్‌రావు అన్నారు. గ్యారంటీలకు సంబంధించి ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు తీసుకుని జీవోలు విడుదల చేస్తే కోడ్ వచ్చినా ఇబ్బందులేమీ ఉండవన్నారు. శ్వేత పత్రాలు కూడా హామీల ఎగవేతల పత్రాలా? అనే అనుమానాలున్నాయని, ఈ విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించామన్నారు. ప్రభుత్వం గ్యారంటీలకు సంబంధించి ఏం చేసినా ఫిబ్రవరి 20వ తేదీలోగానే చేయాలన్నారు. ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోందన్నారు. ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ పెడితేనే హామీల అమలు సాధ్యపడుతుందన్నారు. పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టక పోతే అన్నిటీకీ కోతలు తప్పవన్నారు.
మరో కీలక మైన హామీ రైతులు పండించిన ధాన్యానికి బోనస్ ప్రకటించడమని, ఈ ఖరీఫ్‌లో ఎలాగూ బోనస్ ఇవ్వలేదని.. యాసంగి పంట కూడా పార్లమెంట్ ఎన్నికల సమయంలోనే వస్తుందన్నారు. పంటకు బోనస్‌పై ఇప్పుడు విధానపరమైన నిర్ణయం తీసుకోకపోతే యాసంగిలో రైతులు నష్టపోతారన్నారు. డిసెంబర్ 9 నాడే రైతు భరోసా, రైతు రుణమాఫీ, ఆసరా పెన్షన్ల పెంపు, 200 యూనిట్ల లోపు విద్యుత్ బకాయిల మాఫీ అమలు చేస్తామని రేవంత్ ఎన్నికల సభల్లో హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. డిసెంబర్ 9 గడిచిపోయినా వాటి అమలు కాలేదని ప్రజలు ఆందోళనలో ఉన్నారన్నారు. రైతుబంధు డబ్బులపై మా ప్రభుత్వం అపుడు ప్రతిరోజూ ప్రెస్‌నోట్ ఇచ్చేదన్నారు. అసెంబ్లీలో శ్వేతపత్రాలు ఇచ్చిన వారికి రైతుబంధు డబ్బులపై ప్రతి రోజూ ప్రెస్‌నోట్ ఇవ్వడంలో ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వం తీరు చూస్తుంటే దాటవేత ఎగవేత అన్నట్టుగా ఉందని ఆరోపించారు.
ఆరోగ్యశ్రీ మొత్తాన్ని రూ.పది లక్షల పెంచామన్నారని.. ఎంత మందికి వర్తించిందో వివరాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పది లక్షల ఆరోగ్య శ్రీ అమలైందని చెప్పారు. ఈ ప్రభుత్వం చేయబోయే అప్పును సైతం మొన్నటి శ్వేతపత్రంలో చూపించారన్నారు. ఆర్బీఐకి రూ.13వేల కోట్ల అప్పు తీసుకోవడానికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం విజ్ఞప్తి చేసిందని వార్తల్లో చూశానన్నారు. డిసెంబర్లో రూ.1400కోట్ల అప్పు తెచ్చుకున్నారని తెలిసిందన్నారు. నిరుద్యోగ భృతిపై డిప్యూటీ సీఎం భట్టి, రాహుల్, ప్రియాంక ఇచ్చిన హామీలకు విరుద్ధంగా మాట్లాడారన్నారు. జాబ్ కేలండర్ ప్రకటించిన వాళ్లు ఇప్పటి నుంచే మార్గదర్శకాలు రూపొందించుకోవాలని కదా? అని ప్రశ్నించారు. గ్యారంటీలు ఇచ్చినప్పుడు బడ్జెట్ గుర్తించి కాంగ్రెస్ వాళ్లకు అవగాహన లేదా? అని ప్రశ్నించారు. గ్యారంటీలపై ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిందేనన్నారు.
సీఎం స్థాయి వ్యక్తి వాహనాలు దాచిపెట్టడం అని మాట్లాడటం సరికాదని హరీశ్‌రావు అన్నారు. ప్రభుత్వం దాచడం ఏం ఉంటుందని ప్రశ్నించారు. బులెట్ ప్రూఫ్ కోసం వాహనాలు ఎవ్వరైనా విజయవాడకు పంపాల్సిందేనన్నారు. అవి సీఎం వాడుకోరా? ప్రభుత్వం వాడుకోదా? అని ప్రశ్నించారు. ప్రతి భవన్లో అన్ని రూంలు ఉన్నాయని కాంగ్రెస్ నేతలు అన్నారని.. ఇప్పుడు డిప్యూటీ సీఎం, మిగతా వారు ప్రగతి భవన్లో ఉంటున్నారని.. ఎన్ని గదులు ఉన్నాయో వారే చెప్పాలన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లోగా కాంగ్రెస్ గ్యారెంటీలకు మార్గదర్శకాలు ఇచ్చి జీవోలు విడుదల చేయాలన్నారు. పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశ పెడితేనే గ్యారంటీలు సరిగా అమలవుతాయని.. లేకపోతే అన్నింటికీ కోతలు తప్పవన్నారు.
ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రోటోకాల్ ఉల్లంఘన జరుగుతోందన్నారు. నర్సాపూర్, జనగామ, హుజూరాబాద్, సంగారెడ్డి నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు గౌరవం ఇవ్వకుండా.. ఓడిపోయిన కాంగ్రెస్ నేతలకు అధికారులు ఆహ్వానాలు పంపారన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలకు అవమానం జరుగుతోందని ఆరోపించారు. అసెంబ్లీలో సీఎం 119 ఎమ్మెల్యేలను సమాన దృష్టితో చూస్తామని చెప్పారని.. ఇప్పుడేం జరుగుతోందని ప్రశ్నించారు. తాము అధికారంలో ఉన్న సమయంలో ప్రోటోకాల్‌ను ఉల్లంఘించలేదన్నారు. పార్లమెంట్ ఎన్నికలకు తమ వ్యూహాలు తమకు ఉన్నాయని హరీశ్‌రావు స్పష్టం చేశారు.