Harish Rao | సిద్దిపేట : కాళేశ్వరం నీళ్లు ఎత్తిపోయకుండా సముద్రం పాలు చేస్తున్న రైతు వ్యతిరేక కాంగ్రెస్ సర్కార్‌పై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. వరద నీళ్లను ఒడిసిపట్టి.. బురద రాజకీయాలను మానుకోవాలని రేవంత్ సర్కార్‌ను హరీశ్‌రావు హెచ్చరించారు. సిద్దిపేటలో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.
కాళేశ్వరం మోటార్లపై కాంగ్రెస్ కుట్ర పన్నింది. మోటార్లను ఆన్ అండ్ ఆఫ్ చేస్తున్నారు. అవేమన్న మీ ఇంట్లో ఉండే మోటార్లు అనుకున్నారా? అలా చేస్తే మోటార్లు పాడైతాయి. బేరింగ్లు పోతాయి.. వేలకోట్ల నష్టం వాటిల్లుతుంది. ఈ విషయంపై బీహెచ్ఈఎల్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. మోటార్లు పనికిరాకుండా అయితే మళ్లీ ఆ బద్నాం బీఆర్ఎస్ పార్టీపై వేయాలని చూస్తున్నారని హరీశ్‌రావు పేర్కొన్నారు.
రేవంత్ రెడ్డికి, ఉత్తం కుమార్ రెడ్డికి నీళ్ల విలువ తెలియదు. కాంగ్రెస్ ప్రభుత్వ నేరపూరిత నిర్లక్ష్యం వల్ల రాష్ట్ర రైతాంగానికి తీవ్రమైన నష్టం జరుగుతున్నది. కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యిలాగా కాళేశ్వరం ప్రాజెక్టు ఉంటే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లను సముద్రంలోకి వదులుతూ ప్రాజెక్టును పడావు పెట్టింది. ఇప్పటికైనా బురద రాజకీయాలు మాని వరద నీటిని ఒడిసి పట్టండి అని హరీశ్‌రావు హెచ్చరించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్ర రైతాంగానికి నష్టం కలుగుతున్నది. ఉన్న వ్యవస్థను నడపడం కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతకావడం లేదా..? కమీషన్లకు, వాటాలు పంచుకోవడానికి సమయం సరిపోతలేదా..? రైతు ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యమా ? నంది మేడారంలో ఖటక ఒత్తితే రోజుకి రెండు టీఎంసీల నీళ్లు వచ్చి మిడ్ మానేరులో పడతాయి. వారం రోజుల కిందనే ఈ విషయాన్ని ఉత్తంకుమార్ రెడ్డికి తెలుపుతూ ఉత్తరం రాశాను. అన్నపూర్ణ రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్, బస్వాపూర్ రిజర్వాయర్లు ఖాళీగా ఉన్నాయి. చెరువులన్నీ ఖాళీగా ఉన్నాయి. నీళ్లను ఒడిసి పట్టండి. వెంటనే మోటర్లు ఆన్ చేయండి అని ప్రభుత్వానికి విన్నపం చేశాను. దురదృష్టం ప్రభుత్వం మోటర్లు ఆన్ చేయలేదు. ఇప్పుడు ఎల్లంపల్లి గేట్లెత్తి నీళ్లను సముద్రంలోకి వదులుతున్నారు అని హరీశ్‌రావు మండిపడ్డారు.
ఇది కాంగ్రెస్ ప్రభుత్వ క్రిమినల్ నెగ్లిజెన్సీ.. నీళ్ల విలువ రైతులకు తెలుస్తది.. ఉత్తంకుమార్ రెడ్డికి, రేవంత్ రెడ్డికి తెలియదు. కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్నా, ముఖ్యమంత్రిగా ఉన్నా వ్యవసాయం చేసే ఒక రైతు. ఆయన రైతు గనుక ప్రతి చుక్కను ఒడిసిపట్టి నీళ్లను రైతులకు అందించాడు. మీరు ఎన్నడు వ్యవసాయం చేయలేదు అందుకే మీకు నేల విలువ తెలియదు. ఈ రోజు కృష్ణా, గోదావరి నీళ్లు సముద్రం పాలయితుంటే గుడ్లప్పగించి రేవంత్ రెడ్డి, ఉత్తంకుమార్ రెడ్డి చూడడం తప్ప ఏం చేయడం లేదు. కాంగ్రెస్ సర్కార్ నేరపూరిత నిర్లక్ష్యం వల్ల రాష్ట్ర రైతాంగానికి తీవ్రమైన నష్టం జరుగుతున్నది అని హరీశ్‌రావు ధ్వజమెత్తారు.