Sarpanches | హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): ‘కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పెండింగ్ బిల్లులు ఇప్పిస్తామని చెబితే నమ్మాం. మా పదవీ కాలం ముగిసి ఎనిమిది నెలలు దాటింది. అప్పిచ్చిన వారికి ముఖం చూపించలేకపోతున్నం.. సీఎం, మంత్రుల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నం.. బతిమిలాడుతున్నం.. దండం పెట్టుకుంటున్నం.. అయినా బిల్లులు రాలేదు..ఇగ గత్యంతరంలేని పరిస్థితుల్లో కుటుంబసభ్యులు సహా మూకుమ్మడి ఆత్మహత్యలే గతి..’ ఇప్పుడు రాష్ట్రంలో ఏ తాజా మాజీ సర్పంచ్ని కదిలించినా వినిపిస్తున్న మాట ఇదే. కాంగ్రెస్ సర్కారు వైఖరిపై మాజీ సర్పంచులు భగ్గుమంటున్నారు. నమ్మించి నట్టేట ముంచిందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఎన్నిసార్లు విన్నవించినా గత ప్రభుత్వంపై నెపం నెట్టేసి తప్పించుకుంటున్నదని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. 80 శాతం మంది బీఆర్ఎస్కు చెందిన వారైనందునే నిర్లక్ష్యం చేస్తున్నదని సర్పంచుల సంఘం జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు యాదయ్యగౌడ్ ఆరోపిస్తున్నారు.
1200 కోట్ల బకాయిలు
కొంత ఆలస్యమైనా బిల్లులు వస్తాయనే నమ్మకంతో తాజా మాజీ సర్పంచులు గ్రామా ల్లో అనేక అభివృద్ధి పనులు చేపట్టారు. పల్లెప్రకృతి వనాలు, శ్మశానవాటికలు, పంచాయతీ భవనాలు నిర్మింపజేశారు. అంతకుముందు ప్రభుత్వం గ్రామాల్లో అభివృద్ధి పనులకు నిధులు టంఛన్గా విడుదల చేసింది. కరోనా కారణంగా రెండున్నరేండ్లు దేశంతో పాటు అన్ని రాష్ట్రాల్లో ఆర్థిక సంక్షోభం తలెత్తింది. ఈ పరిస్థితుల్లో సర్పంచులకు బిల్లుల చెల్లింపు ఆలస్యమైంది. కేంద్రం కూడా 15వ ఆర్థిక సంఘం ద్వారా ప్రతినెలా ఇవ్వాల్సిన సుమారు రూ. 150 కోట్లు పెండింగ్లో పెట్టింది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన రూ. 300 కోట్లతోపాటు త్తంగా రూ.1200 కోట్ల వరకు పెండింగ్లో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో అప్పులు తెచ్చి అభివృద్ధి పనులు చేశామని, తమ పదవీకాలం కనీసం బిల్లులు వచ్చేవరకైనా కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. వారి వినతులను రేవంత్ ప్రభుత్వం బుట్టదాఖలు చేసింది. పంచాయతీ పాలకవర్గాల గడువు ముగిసిన వెంటనే ఫిబ్రవరిలో ప్రత్యేకాధికారులను నియమించింది.
అడుగడుగునా నిర్బంధం..
అప్పుల భారం, కుటుంబపోషణ కష్టం కావడంతో ఇన్నాళ్లు ఉన్నంతలో దర్జాగా బతికినచోట మాజీ సర్పంచ్లు తలెత్తుకోలేని పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. గత్యంతరంలేని పరిస్థితుల్లో రెండు నెలలుగా జిల్లాకేంద్రాల్లో నిరాహార దీక్షలు చేపట్టారు. నిరసన ర్యాలీలు చేపట్టినా, ప్రజాభవన్లో అనేకసార్లు విన్నవించినా సర్కారు పట్టించుకోలేదు. సెప్టెంబర్ 12న హైదరాబాద్లోని అమరవీరుల స్తూపం వద్ద శాంతియుతంగా నిరసన తెలిపిన మాజీ సర్పంచులపై సర్కారు దమనకాండకు దిగింది. సుమారు 800 మంది తాజా మాజీ సర్పంచులను అరెస్ట్ చేసింది. సర్పంచుల సంఘం రాష్ట్ర జేఏసీ పిలుపుమేరకు ఈ నెల 4న హైదరాబాద్లోని పెద్దమ్మగుడి నుంచి ‘చలో హైదరాబాద్ పోరుబాట’కు తరలివస్తున్న సర్పంచులను ఎక్కడికక్కడ అరెస్ట్లు చేయించింది. గ్రామాల్లో బైండోవర్ చేసి, కేసులు తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది.
ఉద్యమం తీవ్రతరం
బిల్లుల కోసం 11 నెలలుగా మంత్రులకు విన్నపాలు, పలుమార్లు నిరసనలు తెలిపినా పెడచెవిన పెట్టడంతో సర్పంచుల జేఏసీ, రాష్ట్ర సర్పంచుల సంఘం మరోమారు ఉద్యమ కార్యాచరణ ప్రకటించాయి. ఈ నెలాఖరులోగా బిల్లులు చెల్లించకుంటే భార్యాబిడ్డలతో కలిసి సామూహిక నిరాహార దీక్షలు చేపడతామని సర్పంచుల సంఘం జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు యాదయ్యగౌడ్ హెచ్చరించారు. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కకు ఐదుసార్లు వినతిపత్రం ఇచ్చినా స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని నిర్ణయించామన్నారు.
కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలి
ఎంతో శ్రమకోర్చి అప్పులు తెచ్చి గ్రామాలను అభివృద్ధి పనులు చేసినం. ఎన్నికల్లో సర్పంచ్లకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలి. నెలాఖరులోగా పెండింగ్ బిల్లులు చెల్లించాలి. విధి నిర్వహణలో, అప్పుల భారంతో ఆత్మహత్యలు చేసుకున్న సర్పంచుల కుటుంబాలకు రూ. 25 లక్షల పరిహారం అందజేయాలి. ప్రభుత్వం మా డిమాండ్లను పెడచెవిన పెడితే ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం.
– గూడూరి లక్ష్మీనర్సింహారెడ్డి, సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు