రాష్ట్రంలో నడుస్తున్నది ప్రజాపాలన కాదు. కేసీఆర్ హయాంలో విశ్వనగరంగా ఖ్యాతికెక్కిన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్.. కాంగ్రెస్ పాలనలో పూర్తిగా దెబ్బతిన్నది. రియల్ఎస్టేట్ రంగం సర్వనాశనమైంది.
-మీడియాతో మాజీ మంత్రి హరీశ్
సిద్దిపేట, సెప్టెంబర్ 11( నమస్తే తెలంగాణ ప్రతినిధి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీరుతో రాష్ట్రమంతటా రియల్ ఎస్టేట్ వ్యాపారం సర్వనాశనమైందని, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీని రేవంత్‌రెడ్డి దెబ్బతీశారని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. మండలాల్లో రిజిస్ట్రేషన్లు పూర్తిగా తగ్గిపోయాయని, గతంలో రోజుకు 30 రిజిస్టేషన్లు అయితే ఇప్పుడు నెలకు 30 కూడా కావడం లేదని చెప్పారు.
ఈ ప్రభుత్వం పట్టణాలు, గ్రామాలను గాలికి వదిలేసి హైడ్రా పేరిట డ్రామాలు చేస్తున్నదని విమర్శించారు. కేంద్రం ఇచ్చిన రూ.800 కోట్ల ఉపాధి హామీ నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం దారి మళ్లించిందని తెలిపారు. బుధవారం సంగారెడ్డి, మెదక్ జిల్లాలో పర్యటించిన ఆయన, ఇటీవల ఖమ్మం పర్యటనలో కాంగ్రెస్ కార్యకర్తల దాడిలో గాయపడి దవాఖానలో చికిత్స అనంతరం ఇంటికి వచ్చిన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు యావన్నగారి సంతోష్‌రెడ్డిని గుమ్మడిదలలో పరామర్శించారు.
అంతకు ముందు శివ్వంపేటలో స్థానిక నాయకులు, కార్యకర్తలు హరీశ్‌కు ఘనస్వాగతం పలికారు. మెదక్ జిల్లాలోని నర్సాపూర్‌లో స్థానిక ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డితో కలిసి క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశంలో హరీశ్ మాట్లాడుతూ యూట్యూబ్‌లను చూస్తే రేవంత్‌రెడ్డికి వెన్నుల్లో వణుకు పుడుతున్నదని ఎద్దేవాచేశారు. ఫార్మాసిటీ, మెట్రోరైలు విషయంలో సీఎం రూటు మార్చారని మండిపడ్డారు.
రేవంత్ తొందరపాటు వల్ల స్థానిక కాంగ్రెస్ నాయకులు గ్రామాలకు వెళ్లలేని పరిస్థితి వచ్చిందని చెప్పారు. ‘ఏ గ్రామానికైనా వెళ్దాం.. వందశాతం రుణమాఫీ అయ్యిం దో? లేదో? తేల్చుకుందామా?’ అని సవాల్ విసిరారు. భువనగిరి నియోజకవర్గంలో రుణమాఫీ కాలేదని కాంగ్రెస్ నాయకులను రైతులంతా కలిసి రూమ్‌లో వేసి తాళం వేశారని గుర్తుచేశారు.
రేషన్‌కార్డు నిబంధనల వల్లే రైతు ఆత్మహత్య
రేషన్‌కార్డ్ నిబంధనలు పెట్టడం వల్లే రైతు సురేందర్‌రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడని, ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని హరీశ్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో 50 శాతానికి మించి రుణమాఫీ కాలేదని చెప్పారు. 41 లక్షల మందికి రుణమాఫీ కావాల్సి ఉంటే 20లక్షల మందికే చేశారని, ఇంకా 21 లక్షల మందికి మాఫీ కాలేదని తెలిపారు. రైతులకు వందశాతం పంటల రుణాలు మాఫీ అయ్యేదాకా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని చెప్పారు. పంట బీమా, భరోసా కల్పించకపోతే రైతుల తరఫున ఆందోళనలు చేస్తామని ప్రకటించారు. కేసీఆర్ ప్రభుత్వం రైతులకు రెండు సార్లు రుణమాఫీ చేసిందని, ప్రతి పంట సాగుకు ముందే రైతుబంధు అందించి రైతులకు దన్నుగా నిలిచిందని గుర్తుచేశారు.
పది నెలలుగా గ్రామాలకు నిధుల్లేవ్
కాంగ్రెస్ పాలనలో 10 నెలల నుంచి గ్రామ పంచాయతీలకు నిధుల్లేవని హరీశ్‌రావు చెప్పారు. పంచాయతీ కార్యదర్శులు అప్పులు తెచ్చిపెడుతున్నారని, ఒక్క పైసా కూడా పంచాయతీలకు ఇవ్వడం లేదని ప్రభుత్వంపై మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో ప్రతి నెల పల్లె ప్రగతి ద్వారా నిధులిచ్చి గ్రామాలను అద్భుతంగా తీర్చిదిద్దామని గుర్తుచేశారు. చెక్‌డ్యామ్‌లు, ధాన్యం కొనుగోళ్లు, రైతుబీమాకు ప్రాధాన్యత ఇచ్చిందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా విషజ్వరాలతో ప్రజలు బాధపడుతూ దవాఖానల చుట్టూ తిరుగుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఏ ప్రభుత్వ దావాఖానకు వెళ్లినా మందుల కొరత ఉన్నదని చెప్పారు. కుక్కల దాడులు పెరుగుతున్నా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, ఇది ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమేనని మండిపడ్డారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం పడకేసిందని, స్కూల్, హాస్టళ్లలో భోజనం కూడా సరిగా ఉండడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. 10 నెలలవుతున్నా మధ్యాహ్న భో జన నిధులను మంజూరు చేయలేదని వెల్లడించారు. బీజేపీ, కాంగ్రెస్ తెలంగాణ ప్రజలను మోసం చేశాయని ధ్వజమెత్తారు.
గ్రామ, పట్టణాలకు ఇంతవరకు ఎంత నిధులు మంజూరు చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లాలో వరద బాధితులను పరామర్శించి సాయం చేసేందుకు వెళ్లిన తమపై కాంగ్రెస్ నాయకులు దాడి చేయడం అప్రజాస్వామ్యమని ఆగ్రహం వ్యక్తంచేశారు. దాడి చేసిన వారిపై కేసులు పెట్టాల్సింది పోయి తమపైనే కేసులు పెట్టారని మండిపడ్డారు. త్వరలోనే ప్రజలు కాంగ్రెస్ సర్కారుకు తగినబుద్ధి చెప్తారని హరీశ్ హెచ్చరించారు.