Harish Rao | హైదరాబాద్ : తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పాలనలో ఆర్థిక క్షీణతకు అసలు కారణాలను హరీశ్‌రావు వివరించారు. బడ్జెట్‌పై చర్చ సందర్భంగా హరీశ్‌రావు సభలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు.
ఈ పదిహేను నెలల కాలంలో జీఎస్టీ వృద్ది రేటులో తగ్గుదల, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయంలో తగ్గుదల, వాహనాల అమ్మకాల్లో తగ్గుదల, దీనికి కారణం ఆర్థిక మాంద్యమా? ఆత్మ విమర్శ చేసుకోండి. తెలంగాణకు మాత్రమే ఇది రావడానికి పరిపాలనా వైఫల్యమే. పక్క రాష్ట్రాలకు లేని ఆర్థిక మాంద్యం తెలంగాణకే ఎందుకొచ్చింది? ఈ తగ్గుదలకు కారణం ఆర్థిక మాంద్యం కాదు ఆలోచించుకోండి. నేను చాలా బాధగా చెబుతున్నాను. ముఖ్యమంత్రి ఇస్తున్న నినాదం తెలంగాణ రైజింగ్, బట్ వేర్ ఈజ్ ఇట్ రైజింగ్. జీఎస్టీ గ్రోత్ రేట్ డౌన్..స్టాంప్స్ రిజిస్ట్రేషన్ రెవెన్యూ డౌన్.. వెహికిల్ సేల్స్ డౌన్ అంటూ హరీశ్‌రావు ధ్వజమెత్తారు.
రీజన్ 1 – రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలోనేదివ్యంగా ఉన్న రాష్ట్రాన్ని దివాలా దివాలా అని దిక్కుమాలిన ప్రచారం చేయడం వల్ల పెట్టుబడులు రాలేదు.
రీజన్ 2- ప్రభుత్వం కొలువుదీరగానే ఫార్మా సిటీ రద్దు, ఎయిర్ పోర్టుకు మెట్రో రైలు రద్దు అనే నెగిటవ్ ప్రచారం.
రీజన్ 3-హైడ్రా పేరిట సాగించిన విధ్వంస కాండ -పేదల ఇండ్ల కూల్చివేతలు
రీజన్ 4- మూసీ ప్రక్షాళన పేరిట, బఫర్ జోన్ల పేరిట చేసిన హంగామా – సృష్టించిన భయానక వాతావరణం. పెట్టుబడులు రాలేదు, రియల్ ఎస్టేట్ పడిపోయింది.
రీజన్ 5- ఆర్ ఆర్ టాక్స్ లు
రీజన్ 6- సంక్షేమ పథకాల ద్వారా గ్రామాల వైపు సాగుతున్న ద్రవ్య ప్రవాహానికి అడ్డుకట్ట వేయడం. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకూడా దెబ్బతిన్నది.
వీటితో పాటు రైతు బంధు ఇవ్వకపోవడం, పంట కొనుగోలు పూర్తిగాచేయకపోవడం, పింఛన్లు పెంచక పోవడం, ఉన్న పింఛన్లు రెండు నెలలు ఎగ్గొట్టడం, నీళ్లివ్వక పంటలను ఎండగొట్టడం, చెరువుల్లో చేప పిల్లలు వదలక పోవడం, గొర్రెల పంపిణీ నిలిపి వేయడం, గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వక పోవడం, ఉద్యోగులకు పీఆర్సీ, డీఏలు చెల్లించక పోవడం, రియల్ ఎస్టేట్ కుప్పకూలడం, ఇలాంటికారణాల వల్ల ప్రజల కొనుగోలు శక్తి క్రమంగా తగ్గుతూ, ఆర్థిక వృద్ది వేగం మాంద్యం వైపు అడుగులు పడుతున్నాయని హరీశ్‌రావు పేర్కొన్నారు.
కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం గత బీఆర్ఎస్ పై దుష్ర్పచారం తప్పించుకుంటున్నారని హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ‘‘భట్టి గారు తన బడ్జెట్ ప్రసంగంలో.. నిజాలు ప్రచారంలో ఉండాలి, లేదంటే అబద్దం నిజంగా మారి రాష్ట్రాన్ని, దేశాన్నే కాదు ప్రపంచాన్ని కూడా నాశనం చేస్తుందని’’ చెప్పారు. నేను వారి మాటలతో నేను ఏకీభవిస్తున్నాను. ‘‘నువ్వు రోజూ అబద్దం ఆడితే, అది నిన్ను రేపు కూడా అబద్దం ఆడే దుస్థితికి తెస్తుంది’’ ఇది శ్రీశ్రీ గారు చెప్పిన మాట. మీరు అదే పనిగా చేస్తున్న అబద్దాలను పటాపంచలు చేసి సత్యాన్ని చెప్పదలుచుకున్నాను. పదేండ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ భద్రం అనేది నిజం, ఛిద్రమైందనేది అబద్దం. ఆర్థిక వ్యవస్థ గాడితప్పిందనడం అబద్దం, బలోపేతమైందన్నది నిజం. పదేండ్ల పాలనలో ఆర్థిక అరాచకత్వం అన్నది అబద్దం.. ఆర్థిక స్థిరత్వం సాధించిందనేది అసలు నిజం. దివాలా తీసిందనేది అబద్దం. దివ్యంగా ఉన్నదన్నది నిజం. కేసీఆర్ సంపద పెంచింది నిజం, ప్రజలకు పంచింది నిజం. 2013-14లో 4లక్షల 50వేలుగా ఉన్న జీఎస్డీపీ తొమ్మిదిన్నరేండ్లలో 15లక్షల కోట్లకు పెరిగింది. ఇది అక్షర సత్యం. మా పాలనలో 12శాతంగా ఉన్న జీఎస్డీపీ వృద్ది రేటు, కాంగ్రెస్ ఏడాది పాలనలో 10శాతానికి తగ్గింది. 1లక్షా 24వేలుగా ఉన్న తలసరి ఆదాయం మా పదేళ్ల పాలనలో 3లక్షల 56వేలకు పెరిగింది. ఇది మీరు కూడా ఒప్పుకొని, చెప్పుకుంటున్న సత్యం. మా పాలనలో 12.4శాతంగా ఉన్న తలసరి ఆదాయం వృద్ది రేటు మీ పాలనలో 9.6శాతానికి తగ్గింది. 2014-15 లో62,306 కోట్లున్న ప్రభుత్వ వ్యయం,2023-24 నాటికి 2,31,825 కోట్లకుపెంచాం. అనగా నాలుగు రెట్లు పెంచినం. సంపద పెంచినం, పేదలకు పంచినం అనడానికి ఇది నిదర్శనం. సొంత ఆదాయ వనరుల వృద్దిలో దేశంలోనే తెలంగాణనునంబర్ వన్ రాష్ట్రంగా నిలిపాం. మా పాలనలో గ్రోత్ రేట్ ఆకాశం వైపుచూస్తే, మీ పాలనలో పాతాళం వైపు చూస్తున్నది. దివాలా తీసింది రాష్ట్రం కాదు, మీ ఆలోచనలు దివాలా. మీరు అనుసరిస్తున్న విధానాలు దివాలా.మొత్తంగా మీ పరిపాలన దివాలా ఉంది. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం దివాళా తీయలేదు అని హరీశ్‌రావు తెలిపారు.