హైదరాబాద్, డిసెంబర్ 19 (నమస్తేతెలంగాణ): మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నుంచి గాంధీజీ పేరు తొలగించడం ఆక్షేపణీయమని మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. పేదల బతుకుల్లో వెలుగులు నింపిన స్కీమ్‌కు వికసిత్ భారత్‌జీ రామ్‌జీగా పేరుపెట్టడం అభ్యంతరకరమని శుక్రవారం ఎక్స్ వేదికగా దుయ్యబట్టారు. బీజేపీ ప్రభుత్వ తీరు సమాఖ్య వ్యవస్థపై ప్రత్యక్ష దాడిగా ఉం దని, 60:40 నిధుల నిష్పత్తిని తెరపైకి తె చ్చి ఉద్దేశపూర్వకంగా పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రలు జరుగుతున్నదని ధ్వజమెత్తారు. కొత్త నిబంధనతో రాష్ట్రాలపై అదనపు ఆర్థిక భారం పడుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. కేంద్రం నిర్ణయం పేదలకు పని కల్పించే పథకాన్ని దెబ్బతీయడమేని ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వం రాష్ట్రాలకు రాజ్యాంగం కల్పించిన స్వయంప్రతిపత్తిని కాలరాస్తున్నదని మండిపడ్డారు.
ఉపాధి పథకాన్ని నిర్వీ ర్యం చేసి రాష్ట్రాల హక్కులను కేంద్రం కాలరాస్తుంటే అడ్డుకోవాల్సిన కాంగ్రెస్ ఎందుకు మౌనంగా ఉందని హరీశ్‌రావు ప్రశ్నించారు. బయట సమాఖ్య స్ఫూర్తి, రాష్ట్రాల హక్కుల గురించి మాట్లాడే హస్తంపార్టీ, పార్లమెంట్లో మాత్రం రాష్ర్టాలను బలహీనపరిచే బీజేపీ సర్కారు నిర్ణయాలకు లోపాయికారిగా మద్దతు ఇస్తున్నదని ఆరోపించారు. అధికార కేంద్రీకరణ, రాష్ట్రాల హక్కులను దెబ్బతీయడంలో బీజేపీ, కాంగ్రెస్ ఒకే నాణానికి రెండు ముఖాలు అనే విషయం భారత్‌జీ రామ్‌జీ బిల్లుతో బట్టబయలైందని దుయ్యబట్టారు. బృహత్తర స్కీమ్‌ను బీజేపీ రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటూ గొప్ప సంస్కరణగా చిత్రీకరించడం హాస్యాస్పదమన్నారు. ఉపాధి చట్టం మౌలిక స్వరూపం దెబ్బతినకుండా కాపాడాలని, మహాత్ముడి పేరును యథావిధిగా కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు.