Harish Rao : కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో పాలమూరు ప్రాజెక్టులో చేసిన పనులు ఏమున్నాయని తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్‌రావు ప్రశ్నించారు. రెండేళ్లలో పాలమూరు ప్రాజెక్టు పనుల్లో ఒక్కటైనా చేశారా చెప్పాలని తాను ఉత్తమ్‌కుమార్ రెడ్డికి సవాల్ విసురుతున్నానని అన్నారు. తెలంగాణ భవన్లో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్యాకేజ్-3 లో భాగంగా కేవలం రెండు కిలోమీటర్ల కాలువ తవ్వితో 30 టీఎంసీల సాగు నీటిని నిలువ చేసేలా పూర్తి సిస్టమ్‌ను సిద్ధం చేసి ఉంచామని, కానీ కాంగ్రెస్ సర్కారు రెండేళ్లయినా ఆ పని చేయలేదని హరీశ్‌రావు ఆరోపించారు. రిజర్వాయర్లు, టన్నెల్లు, పంప్‌హౌస్‌లు, సబ్స్టేషన్లు సిద్ధం చేశామని, మీరు గా రెండు కిలోమీటర్ల కాలువ కూడా ఎందుకు తవ్వలేకపోయారని నేను ప్రశ్నిస్తున్నానని అన్నారు. మీరు రెండేళ్లలో చేసిన పనులేందో చూపిస్తమంటే ఎక్కడికైనా పొయ్యి చూద్దామని, మేం చేసిన పనులు చూపించమంటే చూపిస్తామని సవాల్ చేశారు.