రాయపర్తి, నవంబర్ 18 : ఫార్మా కంపెనీల పేరుతో సీఎం రేవంత్‌రెడ్డి లగచర్ల గిరిజనులపై దాడులకు పాల్పడుతున్నాడని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆరోపించారు. కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్లలో గిరిజనులపై పోలీసుల దమనకాండ, అక్రమ కేసుల బనాయింపును నిరసిస్తూ వరంగల్ జిల్లా రాయపర్తిలోని వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సోమవారం గిరిజనులు, పార్టీ శ్రేణులతో కలిసి రాస్తారోకో నిర్వహించారు. మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్‌తో కలిసి ఎర్రబెల్లి హాజరై మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం హైదరాబాద్‌కు అతి చేరువలో ఫార్మా సిటీ కోసం భూసేకరణ జరిపి ల్యాండ్ బ్యాంక్‌ను ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. అయితే సీఎం రేవంత్‌రెడ్డి తన సోదరులు, వియ్యంకుడు, అల్లుడు, బంధువులకు మేలు చేయడం కోసమే లగచర్ల గిరిజనులపై పోలీసులతో అక్రమ కేసులు పెట్టారని మండిపడ్డారు. ప్రభుత్వం ఏం సాధించిందని వరంగల్‌లో ప్రజాపాలన విజయోత్సవ సభ నిర్వహిస్తున్నదో చెప్పాలని డిమాండ్ చేశారు.
పాలకుర్తి: ఫార్మా కంపెనీల పేరుతో గిరిజనుల భూములను లాక్కోవాలని చూస్తున్న సీఎం రేవంత్‌రెడ్డికి గిరిజనుల చేతిలో పరాభవం తప్పదని ఓయూ జేఏసీ ప్రధాన కార్యదర్శి భూకా రాజేశ్‌నాయక్ హెచ్చరించారు. సోమవారం జీసీసీ మాజీ చైర్మన్ ధరావత్ మోహన్‌గాంధీనాయక్, మాజీ జడ్పీటీసీ పుస్కూరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గిరిజనులతో కలిసి జనగామ జిల్లా పాలకుర్తిలో రాస్తారోకో చేపట్టారు. రాజేశ్‌నాయక్ మాట్లాడుతూ ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో అధికారులు గిరిజనులపై దాడులకు పాల్పడటం తగదన్నారు.