హైదరాబాద్, జూలై 15 (నమస్తేతెలంగాణ): రాష్ట్రంలోని గౌడన్నల ఆత్మగౌరవ గుండెలపై సీఎం రేవంత్రెడ్డి తన్ని తాను బీసీ విరోధినని మరోసారి స్పష్టంచేశారని స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్ ఆంజనేయగౌడ్ ఆరోపించారు. లషర్గూడ సభలో సీఎం వ్యవహారశైలి దారుణమ ని ఆయన సోమవారం విడుదల చేసిన ప్రకటనలో ఆవేదన వ్యక్తంచేశారు. గౌడన్నను చెట్టుపై చాలాసేపు నిలబెట్టి, కింద కుర్చీపై కాలుమీద కాలేసుకొని కూర్చొని వృత్తిని ఎగతాళి చేస్తూ, సహచర మంత్రులతో ఎకసెక్కాలాడుతూ సీఎం రేవంత్ తన దొరతనాన్ని ప్రదర్శించారని మండిపడ్డారు. కేసీఆర్ ప్ర భుత్వం కేరళ వంటి రాష్ట్రాలకు ప్రతినిధి బృందం పంపి, అధ్యయనం చే యించి, బడ్జెట్ కేటాయించి రూపొందించిన కాటమయ్య రక్షణ కవచం కిట్లను తన ప్రభుత్వ పథకంగా సీఎం రేవంత్ ప్రగల్భాలు పలుకడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. బడుగులపై వైఖరి మారకపోతే, ముఖ్యమంత్రికి ముందున్నది ముసళ్ల పండుగ అని ఆంజనేయగౌడ్ హెచ్చరించారు.