e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, September 28, 2021
Home Top Slides ప్రతి ఇంచు సాగులోకి

ప్రతి ఇంచు సాగులోకి

  • పడావు భూముల్లో పసిడి పంటలు
  • కాళేశ్వరం జలాలకు తోడైన వర్షాలు
  • కొత్తగా సాగులోకి 32 లక్షల ఎకరాలు
  • రైతన్నకు దన్నుగా ప్రభుత్వ పథకాలు

ఏండ్ల గోస తీర్చుతూ ఎత్తుకెగసిన కాళేశ్వర జలగంగ మెట్టభూములను మాగాణంలా మార్చేస్తున్నది. ఒకనాడు పల్లేర్లు మొలచిన భూముల్లో పసిడి పంటలు పండుతున్నాయి. బీడు, బండ, గుట్ట అనే తేడా లేకుండా ప్రతి ఇంచూ సాగులోకి వస్తున్నది. రాష్ట్రం ఏర్పడేనాటికి రెండుసీజన్లలో కలిపి 1.30 కోట్ల ఎకరాల్లో పంటలు వేయగా.. నేడు ఒక్క వానకాలంలోనే సుమారుగా 1.40 కోట్ల ఎకరాలు సాగవుతున్నాయి. ఏడేండ్లలో తెలంగాణ ఎవుసం సాధించిన అద్భుతమిది.

హైదరాబాద్‌, ఆగస్టు 21(నమస్తే తెలంగాణ): ఎకరం భూమి సాగైతే అదే మహాభాగ్యమన్నచోట రెండు కోట్ల ఎకరాలు దాటి సాగవుతున్నది. ఏడేండ్లలోనే అద్భుతాలు సృష్టిస్తూ దేశంలో తెలంగాణ వ్యవసాయరంగం సగర్వంగా తలెత్తుకుంటున్నది. సీఎం కేసీఆర్‌ కృషితో కాళేశ్వరం నీళ్లు కాలువల్లో పారటంతో పడావు భూముల్లో పసిడి పంటలు పండుతున్నాయి. చెరువులు అలుగు పారుతుండటంతో అన్నదాతలు అంగు ళం భూమి కూడా వదలకుండా అచ్చుకడుతూ సాగులోకి తెచ్చుకుంటున్నారు. తినడానికి నాలుగు గింజలు పండితే చాలనుకున్న తెలంగాణ రైతన్న.. నేడు దేశానికి బువ్వపెట్టే స్థాయికి ఎదిగాడు. రాష్ట్రంలో ఏటికేడు సాగుభూమి పెరుగుతూనే ఉన్నది. ఏడేండ్లలో ఏకంగా 32 లక్షల ఎకరాల పడావుభూమి పారుగంతలోకి వచ్చింది. మొత్తం వ్యవసాయభూమిలో ప్రతిఇంచూ సాగులోకి వస్తున్నది. రాష్ట్రం ఏర్పడిన 2014-15లో తెలంగాణలో వానకాలంలో సాగైన భూమి కేవలం 1.03 కోట్ల ఎకరాలు మాత్రమే. ఆ మరుసటి ఏడాది కోటి ఎకరాలకే పరిమితమైంది. మిషన్‌కాకతీయ పథకంతో చెరువుల పునరుద్ధరణ, కాళేశ్వరం ఎత్తిపోతలు, పెండింగ్‌ ప్రాజెక్టుల నిర్మాణంతో 2017-18 నుంచి రాష్ట్రంలో వ్యవసాయరంగం ఊపందుకున్నది. సాగుభూమి భారీగా పెరగడం ఆరంభమైంది. గతేడాది వానకాలంలో రికార్డుస్థాయిలో 1.35 కోట్ల ఎకరాలు సాగవగా.. ఈ ఏడాది (2021-22) 1.40 కోట్ల ఎకరాల్లో పంటలు సాగవుతాయని ప్రభుత్వం అంచనావేసింది. రాష్ట్రం ఏర్పడిన తొలి నాళ్లతో (2014-15)తో పోల్చితే గత ఏడాది(2020-21)నాటికి 32 లక్షల ఎకరాలకు పైగా భూమి కొత్తగా సాగులోకి వచ్చింది. ఈ ఏడాది సాగు విస్తీర్ణం ఇంత భారీ స్థాయిలో సాగు భూమి అందుబాటులోకి రావడం అంత సులువైంది, తేలికైన విషయం కాదు. కానీ తెలంగాణ దాన్ని చేసి నిరూపించింది.

- Advertisement -

ఇంచు.. ఇంచు అచ్చుకడుతున్నరు
గతంలో సాగునీటి వసతి సరిగా లేకపోవడంతో రైతులు తమకున్న భూమిలో కొంతభాగం మాత్రమే సాగుచేసేవారు. మిగిలినదంతా బీడుగానే ఉండేది. స్వరాష్ట్రంలో సాగునీరు పుష్కలంగా అందుబాటులోకి రావడంతోపాటు రెండుమూడేండ్లుగా వర్షాలు విస్తారంగా కురుస్తుండటంతో రైతులు బీడు భూములను సాగులోకి తీసుకొస్తున్నారు. రాళ్లు, రప్పలను తొలగించి.. చెలకలు, గుట్ట ప్రాంతాలను కూడా సాగుకు అనుకూలంగా మార్చుతున్నారు. ఇంచు భూమికూడా వదలకుండా అచ్చుకడుతున్నారు. గత మూడేండ్లుగా రాష్ట్రంలో ఏ మూలన చూసినా పచ్చని పొలాలే దర్శనమిస్తున్నాయి.

ప్రాణం పోసిన పథకాలు
ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే కేసీఆర్‌.. వ్యవసాయరంగాన్ని గాడిలో పెట్టేందుకు పలు విప్లవాత్మకమైన పథకాలకు శ్రీకారం చుట్టారు. కాళేశ్వరం వంటి భారీ ప్రాజెక్టుతో తెలంగాణ సాగునీటి గోస తీర్చారు. కాళేశ్వరం నీళ్లను కాలువల్లో పారించి చెరువులు నింపారు. నడివేసవిలోనూ మత్తళ్లు దుంకేలా చేశారు. 24 గంటల ఉచిత విద్యుత్తుతో రైతన్నకు కరెంటుకష్టాలు తీరాయి. పంట పెట్టుబడి కోసం రైతులు వడ్డీ వ్యాపారుల వద్ద చేయిచాచవద్దనే ఉద్దేశంతో ప్రపంచంలో మరెక్కడాలేనివిధంగా రైతుబంధు పథకాన్ని అమలుచేశారు. మిషన్‌ కాకతీయతో చెరువులకు పూర్వవైభవం తీసుకొచ్చారు. ఈ పథకాలన్నీ తెలంగాణ వ్యవసాయరంగానికి ప్రాణవాయువును అందించాయి. ఓవైపు ప్రభుత్వపథకాలు, మరోవైపు ప్రాజెక్టులతో పుష్కలమైన సాగునీరు.. ఇంకోవైపు విస్తారమైన వర్షాలు వెరసి తెలంగాణ వ్యవసాయరంగం దేదీప్యమానంగా వెలుగుతున్నది. రికార్డుస్థాయిలో భూమి కొత్తగా సాగులోకి వస్తున్నది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana