హైదరాబాద్, ఆగస్టు 24(నమస్తే తెలంగాణ): ఉచిత చేప పిల్లల పంపిణీ పథకంలో పారదర్శకతను పెంపొందించేందుకు ఈ ఏడాది కొత్తగా రెండు సంస్కరణలు తీసుకొస్తున్నారు. చేపపిల్లలను లెక్కించేందుకు కౌంటింగ్ మిషన్లు ఏర్పాటు చేయడంతో పాటు చేపపిల్లల రవాణా వాహనాలను జీపీఎస్‌తో అనుసంధానం చేయనున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసే ప్రతి చేపపిల్లను చెరువులోకి చేర్చడం సాధ్యమవుతుందని భావిస్తున్నారు. చేప పిల్లల కౌంటింగ్ మిషన్లను ఒక్కొక్కటి రూ.7 లక్షల చొప్పున బెల్జియం నుంచి కొనుగోలు చేస్తున్నారు. ప్రతి జిల్లాకు ఒకటి ఇవ్వాలని నిర్ణయించిన మత్స్యశాఖ అధికారులు ఇప్పటికే నాలుగు యంత్రాలను కొనుగోలు చేశారు. వీటి కొనుగోలు బాధ్యతలను రాష్ట్రంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్కు అప్పగించారు.
బ్యాంకు గ్యారంటీలన్నీ పున: పరిశీలన
చేపల పంపిణీ టెండర్లలో ఎంపికైన సరఫరాదారులకు సంబంధించిన బ్యాంకు గ్యారంటీ పత్రాలను మత్స్యశాఖ అధికారులు మళ్లీ పరిశీలిస్తున్నారు. ఒకవేళ ఎవరైనా నకిలీ పత్రాలను సమర్పించినట్టు తేలితే.. వారిని టెండర్ నుంచి డిస్క్వాలిఫై చేయడంతో పాటు క్రిమినల్ చర్యలు తీసుకోనున్నారు.