కరీంనగర్ : దళితబంధు పథకంతో ప్రతి దళితుడు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఆదివారం కరీంనగర్ ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన కరీంనగర్ నియోజకవర్గ దళిత బంధు సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం దేశం గర్వించేలా తెలంగాణలో అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెడుతుందని పేర్కొన్నారు.
దాదాసాహెబ్ డా. బి.ఆర్. అంబేడ్కర్ ఒక కులానికి, వర్గానికి చెందిన వ్యక్తి కాదని, వారు ఈ దేశ సంపదని మంత్రి కొనియాడారు. అంబేద్కర్ కన్న కలలను నిజంచేయాలన్నారు. సమానత్వం, సమసమాజ నిర్మాణానికి అనేక మంది పోరాడారని గుర్తు చేశారు. అమెరికా వంటి అభివృద్ది చెందిన దేశాలలో రైతులు, టీచర్లను మాత్రమే సర్ అని సంబోధిస్తారని, మిగిలిన వారందరిని సమానంగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు.
దళితులు, బీసీలు ఆర్థికంగా వెనుకబడి ఉండరాదనే సదుద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని అన్నారు. దళితబందు పథకం ద్వారా పెట్టుబడి పెట్టి కొనుగోలు చేసిన వాటిని కొనుగోలు చేయడం, అమ్మడం చేసినట్లయితే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్, నగర మేయర్ వై. సునీల్ రావు, ఆర్డీవో ఆనంద్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.