హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ): వెటర్నరీ యూనివర్సిటీలో చేపట్టే ఒప్పంద నియామకాల్లో తెలంగాణ వారికే ప్రాధాన్యమివ్వాలని తెలంగాణ వెటర్నరీ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. తాతాలిక అసోసియేట్ ప్రొఫెసర్ల భర్తీకి దేశవ్యాప్తంగా వెటర్నరీ, ఫిషరీస్ సైన్స్లలో పీజీ, పీహెచ్డీ చేసిన అభ్యర్థుల ఇంటర్వ్యూలు శుక్రవారంతో ముగిశాయి.
కేరళ, తమిళనాడు, కర్ణాటక విద్యార్థులకు అకడ ఫిషరీస్ కోర్సుల్లో పీహెచ్డీ చదివే అవకాశం ఉండగా, తెలంగాణ అభ్యర్థులకు ఆ అవకాశం లేక పీజీతోనే సరిపెట్టుకుంటున్నారు. దీంతో ఆ పోస్టుల్లో (ఫిషరీస్ కోర్సులో) పీహెచ్డీ చేసిన తెలంగాణేతర అభ్యర్థులను భర్తీ చేసే అవకాశం ఉందని ఇంటర్వ్యూకు హాజరైన తెలంగాణ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పోస్టుల్లో తెలంగాణ ప్రాంతం వారికి అవకాశం ఇవ్వాలని గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ కాటం శ్రీధర్ డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు.