హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఇటీవల ప్రచురించిన ముసాయిదా ఓటరు జాబితాలో పేర్లు ఉన్నంత మాత్రాన వారందరికీ ఓటు ఉన్నట్టు కాదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) కార్యాలయ వర్గాలు తెలిపాయి. జాబితాలో పేర్లు ఉన్నప్పటికీ ఎన్యుమరేషన్ ఫారంలో అన్‌మ్యాపింగ్ అయినా, తప్పులు నింపినా నోటీసులు వస్తాయని, అందుకే దానిని ముసాయిదా జాబితా అంటున్నామని అధికారులు పేర్కొన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో భాగంగా నోటీసులు అందుకున్న వారంతా తప్పనిసరిగా సమాధానం ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు.
అయితే, ప్రతి ఓటరూ వ్యక్తిగత విచారణకు హాజరు కావాల్సిన అవసరం లేదని తెలిపారు. నోటీసులు అందుకున్నవారు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తమ తరఫున కుటుంబ సభ్యుడిని వ్యక్తిగత విచారణకు పంపవచ్చని, ఇందుకు సంబంధిత ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి (ఈఆర్వో) అనుమతి తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు. ప్రముఖులు, వీఐపీలు, పారిశ్రామికవేత్తలు, వృద్ధులు వ్యక్తిగత విచారణకు బదులుగా కుటుంబ సభ్యుడిని ప్రతినిధిగా పంపవచ్చని, ప్రస్తుతం తెలంగాణలో నివసించనివారు, దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న వారికి కూడా ఈ వెసులుబాటు వర్తిస్తుందని వివరించారు.
వ్యక్తిగత విచారణ నుంచి మినహాయింపు కోరుకునేవారు ఈఆర్వోకు అధికార పత్రం ఇవ్వాలని, ఈఆర్వో సమ్మతిస్తే వారి తరఫు ప్రతినిధులుగా కుటుంబ సభ్యులు విచారణకు హాజరుకావచ్చని, ఆ ప్రతిధులు ఇచ్చిన వివరణ, సమర్పించిన పత్రాలతో ఈఆర్వో సంతృప్తి చెందకపోతే ఓటరును నేరుగా వ్యక్తిగత విచారణకు పిలిచే అవకాశం ఉంటుందని తెలిపారు. వ్యక్తిగత వి చారణ నుంచి ఓటర్లకు మినహాయింపు ఇవ్వా లా? వద్దా? అన్నది ఈఆర్వో విచక్షణాధికారంపైనే ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు.
92 లక్షల మందికి సమస్యలు
రాష్ట్రంలోని 60,50,918 మంది ఓటర్ల ఎన్యుమరేషన్ ఫారాల్లో పేర్లు, వయసులో తేడాలు ఇతర తప్పులు ఉన్నట్టు ‘సర్’ ప్రక్రియలో అధికారులు గుర్తించారు. మరో 32,36,659 మంది ఓటర్లను 2002 ‘సర్’ జాబితాతో మ్యాప్ చేయలేకపోయారు. ఇప్పటివరకు ఈఆర్వోలు, ఏఈఆర్వోలు 80 లక్షల నోటీసులను డౌన్లోడ్ చేశారు. వీటిని ముద్రించి బీఎల్వోల ద్వారా ఓటర్లకు అందజేస్తున్నారు. నోటీసులు అందుకున్న ఓటర్ల నుంచి సంతకాలతోపాటు, వారికి నోటీసులు అందజేస్తున్న ఫొటోలు కూడా తీసుకుంటున్నారు.
అలా ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షలకుపైగా నోటీసులు అందజేశారు. ఎన్యుమరేషన్ ఫారంలో లోపాలున్న ఓటర్లు తమ ఆధారాలకు సంబంధించిన పత్రాలను ఓటర్ల పోర్టల్, బీఎల్వో యాప్ ద్వారా సమర్పించవచ్చు. ఈఆర్వో లేదా ఏఈఆర్వో కార్యాలయంలో వ్యక్తిగత విచారణకు హాజరై అసలు పత్రాలను కూడా చూపించవచ్చు. 2002 సర్ జాబితాలో మ్యాపింగ్ కాని ఓటర్లు మాత్రం ఈఆర్వో/ఏఈఆర్వో కార్యాలయానికి వెళ్లి అసలు పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. ఈ నెల 27 నుంచి వ్యక్తిగత విచారణలతోపాటు గ్రామసభలు నిర్వహించనున్నారు.
అక్టోబర్ 19న తుది జాబితా
రాష్ట్రంలో మొత్తం 3,38,26,448 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 2,64,87,213 మం ది ఎన్యుమరేషన్ ఫారాలను సమర్పించారు. ఆబ్సెంట్, షిఫ్టెడ్, డెడ్, డూప్లికేట్ (ఏఎస్‌డీడీ) క్యాటగిరీల కింద 73,39,235 మంది ఓటర్లు ఉన్నారు. అనామలీస్ జాబితాలో 60,50,918 మంది, 2002 ‘సర్’తో మ్యాపిం గ్ కానివారు 32,36,659 మంది ఉన్నారు. ముసాయిదా ఓటర్ల జాబితాపై క్లెయిమ్‌లు, అభ్యంతరాల స్వీకరణ సెప్టెంబర్ 16 వరకు కొనసాగుతుంది. నోటీసుల ప్రక్రియ, క్లెయిమ్‌లు, అభ్యంతరాల పరిషారం అక్టోబర్ 15 వరకు జరుగుతుంది. తుది ఓటర్ల జాబితాను అక్టోబర్ 19న ప్రకటించనున్నారు.
