Inter Answer Paper | హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): ఇటీవల టీజీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల మూల్యాంకనంలో భారీ తప్పిదాలను మూటగట్టుకున్న సర్కార్‌కు మరో మరక అంటుకునేలా ఉన్నది. ఇంటర్ జవాబుపత్రాల మూల్యాంకనం కూడా లోపాల పుట్టను తలపిస్తున్నది. ఏటా ఏదో ఒక తప్పిదం వెలుగు చూస్తుండగా, ఈసారి భారీ తప్పిదమే బయటికొచ్చింది. ఏకంగా ఓ విద్యార్థిని జవాబుపత్రమే గల్లంతవడంతో మూల్యాంకనం చేయనేలేదు, ఫలితాన్ని వెల్లడించనూలేదు. ఫలితాల్లో ఇన్వ్యాలిడ్ అని చూపించినా అధికారులు తప్పును దిద్దుకోలేకపోయారు. బాధిత విద్యార్థిని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయం చుట్టూ తిరిగినా ఫలితం దక్కలేదు. అధికారులను వెళ్లి కలిస్తే వారి నుంచి నిర్లక్ష్యపు సమాధానమే ఎదురైంది. ‘ఎందుకిలా జరిగింది, పిల్లల భవిష్యత్తుతో ఆటలాడుకుంటారా? అని బాధితురాలి తండ్రి ప్రశ్నిస్తే.. ‘ఇంతకంటే ఎక్కువ మాట్లాడకు’ అంటూ బెదిరించడం సదరు అధికారి వంతయింది.
సీహెచ్ దిశ అనే విద్యార్థిని హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లోని ఓ కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తిచేసింది. ఫస్టియర్‌లో ఇంగ్లిష్, సెకండియర్‌లో బోటనీ, జువాలజీ పేపర్లు తప్పింది. ఈ పేపర్లకు దిశ మార్చిలో నిర్వహించిన వార్షిక పరీక్షలకు హాజరైంది. మంగళవారం ఇంటర్ ఫలితాలు విడుదల కాగా, తన ఫలితాల కోసం వెబ్సైట్లో పలుమార్లు చూసినా ‘ఇన్వాలిడ్’ అని వచ్చింది. దీంతో నివ్వెరపోయిన దిశ చివరికి ఏం జరిగిందో తెలుసుకోవడానికి కాలేజీకి పరుగులు పెట్టింది. కాలేజీలో ఆరా తీస్తే, అక్కడి కాలేజీ ప్రిన్సిపాల్ సూచనలతో దిశ తండ్రి బుధ, గురువారాల్లో ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయానికి వెళ్లినా ఫలితం దక్కలేదు. తెలిసిన వారి ద్వారా ఓ ఉన్నతాధికారిని కలువగా, దిశ ఇంగ్లిష్ పేపర్‌ను మూల్యాంకనమే చేయలేదని పరిశీలనలో తేలింది. ఇంతకు దిశ ఇంగ్లిష్ జవాబుపత్రం ఎక్కడుంది? ఏ మూల్యాంకన క్యాంపులో గల్లంతైంది. దీనికి కారకులెవరు? ఎవరి నిర్లక్ష్యంతో ఇలా జరిగింది? అంటే సమాధానాలు మాత్రం లేవు.
ఈసారి ఇంటర్లో ఏకంగా 10 మంది విద్యార్థుల ఫలితాలను విత్‌హెల్డ్‌లో పెట్టారు. ఫస్టియర్‌లో నలుగురు, సెకండియర్‌లో ఆరుగురి ఫలితాలు ఉన్నాయి. సెకండియర్‌లో ఒక రెగ్యులర్ విద్యార్థి, నలుగురు ప్రైవేట్ విద్యార్థులు, ఒక ఒకేషనల్ విద్యార్థి ఉన్నారు. దిశ పేపర్ గల్లంతయిందన్న వార్తల నేపథ్యంలో ఈ 10 మంది విషయంలోనే ఏం జరిగి ఉంటుందన్న అనుమానాలు వస్తున్నాయి. వీరిలో ఎవరివైనా జవాబుపత్రాలు గల్లంతయ్యాయా? లేక మరేమైనా కారణం దాగి ఉన్నదా? అన్న సందేహాలు తొలుస్తున్నాయి.
ఈసారి మూల్యాంకనాన్ని త్వరగా పూర్తిచేయాలని ఒక్కో ఎగ్జామినర్‌కు పరిమితికి మించి పేపర్లు ఇచ్చారు. వివిధ కేంద్రాల్లో రోజుకు 45 నుంచి 60 వరకు జవాబుపత్రాలు ఇచ్చిన ఉదంతాలు ఉన్నాయి. వాస్తవానికి 40 జవాబుపత్రాలే ఇవ్వాల్సి ఉండగా, త్వరగా ముగించాలన్న లక్ష్యంతో ఎక్కువ ఇచ్చారు. ఈ కారణంగా కూడా లోపాలు తలెత్తినట్టు ఆరోపణలు వస్తున్నాయి. గతంలో జరిగిన తప్పిదాల నేపథ్యంలో ఈసారి ఇంటర్‌బోర్డు కొత్తగా వెరిఫికేషన్ చేయించినా, ఇలాంటి తప్పిదాలు చోటుచేసుకోవడంపై విమర్శలు వస్తున్నాయి.