SI Died | ములుగు : జిల్లాల్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎస్ఐతో పాటు మరో వ్యక్తి మృతి చెందాడు. వీరు ప్రయాణిస్తున్న కారు బోల్తాపడడంతో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఏటూరునాగారం మండం జీడివాగు వద్ద మంగళవారం ఈ ప్రమాదం చోటు చేసుకున్నది. ఘటనలో ఎస్ఐ ఇంద్రయ్యతో పాటు ప్రైవేటు డ్రైవర్ మృతి చెందారు.
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. ములుగు జిల్లాలోని రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన వెంకటాపురం నూగురు మండలంలో పోలీసుల ఉన్నతాధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశం పూర్తయిన తర్వాత భద్రాచలానికి చెందిన ఉన్నతాధికారులకు ఏటూరు నాగారం నుంచి మంగపేట వరకు ఏటూరు నాగారం పోలీస్‌స్టేషన్‌లో రెండో ఎస్ఐగా డీ ఇంద్రయ్య, మరో కానిస్టేబుల్ శ్రీనివాస్‌తో పాటు డ్రైవర్ చెట్టుపల్లి రాజుతో కలిసి ఏటూరునాగారం పోలీస్ స్టేషన్‌కు చెందిన వాహనంలో ఎస్కార్ట్‌గా వెళ్తున్నారు.
ఈ క్రమంలో ఏటూరు నాగారం నుంచి ఐదు కిలోమీటర్ల దూరం వెళ్లిన తర్వాత జీడివాగు వద్ద ఎస్కార్ట్ వాహనం అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో ఎస్ఐ ఇంద్రయ్యతో పాటు డ్రైవర్ రాజు అక్కడికక్కడే మృతి చెందారు. కానిస్టేబుల్ శ్రీనివాస్ గాయాలతో బయటపడ్డారు. ఎస్ఐ ఇంద్రయ్య స్వస్థలం హనుమకొండ జిల్లా పలివేలుపుల గ్రామం. ప్రైవేట్ డ్రైవర్ రాజుది ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాటాపురం గ్రామమని పోలీసు తెలిపారు.