హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): పండ్లను కృత్రిమంగా మగ్గబెట్టేందుకు ఈథెఫోన్, ఎన్‌రైప్‌ను వినియోగించడాన్ని రాష్ట్ర హైకోర్టు సమర్థించింది. ఈథెఫోన్‌ను గ్యాస్ రూపంలో వినియోగించడం కేంద్ర ఆహార భద్రతా ప్రమాణాల మండలి నిబంధనల ప్రకారం సరైనదేనని తీర్పుచెప్పింది. కాలుష్య నియంత్రణ మండలి 2018లో ఇచ్చిన ఉత్తర్వులు చట్టబద్ధమేనని స్పష్టంచేసింది. ఈథెఫోన్, ఎన్‌రైప్ వినియోగాన్ని అనుమతిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీచేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాహితవ్యాజ్యాలను కొట్టేస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్ చంద్రశర్మ, జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలితో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. నిపుణుల అధ్యయనం తర్వాతే ప్రభుత్వం ఈథెఫోన్కు అనుమతి ఇచ్చిందని హైకోర్టు పేర్కొన్నది.