Etamatam | ఇంతకు మునుపు ఏ రాష్ట్రంలోనూ లేని పదవిని ఒకటి సృష్టించి, ఈటల రాజేందర్‌ను చేరికల కమిటీకి చైర్మన్‌ను చేసింది బీజేపీ. పార్టీలో మొదటి నుంచి ఉన్న పాత ‘కాపుల’ను, ఆ తర్వాత చేరిన నేతలను కాదని ఈటలకు అధిష్ఠానం ఈ పదవిని కట్టబెట్టడం వారికి అసలు మింగుడు పడలేదు. తమతో కనీసం చర్చించకుండా, మాట మాత్రమైనా చెప్పకుండా కమిటీ ఏర్పాటు చేయడం ఏమిటని వారికి ఆగ్రహం కలిగింది. దీంతో తమ తడాఖా ఏంటో చూపించడానికి చేరికల కమిటీకి పోటీగా, వీడ్కోలు కమిటీకి సీక్రెట్‌గా శ్రీకారం చుట్టారు.
చేరికల కమిటీని డామినేట్ చేస్తూ వీడ్కోలు కమిటీ చాలా చురుకుగా పని చేసింది. అధిష్ఠానం పెద్దల పట్ల అసంతృప్తిగా ఉన్న నాయకులు అందరినీ సమీకరిస్తూ రోజుకు ఒకరి ఇంట్లో లంచ్, మరొకరి ఇంట్లో డిన్నర్ నిర్వహిస్తూ బాగా వర్కవుట్ చేసింది. ఫలితంగా ముఖ్యనేతలు ఒక్కొక్కరుగా పార్టీకి గుడ్ బై చెప్పడానికి క్యూ కట్టారు. మీరు ఏర్పాటు చేసిన చేరికల కమిటీతో పోలిస్తే…మా వీడ్కోలు కమిటీ పని తీరు ఎలా ఉందో చూడండి అంటూ సదరు నేతలు దెప్పిపొడుస్తున్నారు.
– వెల్జాల