గురువారం 16 జూలై 2020
Telangana - Jun 23, 2020 , 14:57:48

కరోనా పరీక్షలపై ఈటల ఏమన్నారంటే..

కరోనా పరీక్షలపై ఈటల ఏమన్నారంటే..

హైదరాబాద్ : ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా పరీక్షలను వ్యాపార కోణంలో చూడొద్దని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరోనా పరీక్షలు చేస్తున్న ప్రైవేట్ డయాగ్నస్టిక్స్ ప్రతినిధులతో మంత్రి ఈటల, వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ రమేష్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..సాధారణ పరీక్షలకు కొవిడ్ పరీక్షలకు చాలా తేడా ఉంది. ఇక్కడ సర్వైలెన్స్, ట్రేసింగ్, ట్రీటింగ్ విధానాలు ఇమిడి ఉంటాయన్నారు. కావున పాజిటివ్ వచ్చిన ప్రతి పేషెంట్ వివరాలు పోర్టల్ లో అప్లోడ్ చెయ్యాలని, వైద్య ఆరోగ్య శాఖకు సమాచారం అందించాలని మంత్రి సూచించారు.


పరీక్షలకు వచ్చిన ప్రతి ఒక్కరి రిజల్ట్స్ వచ్చే వరకు ఐసొలేషన్ లో ఉండాలని వారికి సూచించాలన్నారు. దయ చేసి పరీక్షలు ఇంటికి వచ్చి చేస్తామని, ఇంకా ఏ ఇతర పద్ధతుల్లో కూడా మార్కెటింగ్ చేయొద్దన్నారు. విమాన ప్రయాణికులకు లక్షణాలు లేకపోయినా కరోనా పరీక్షలు చేసి రిపోర్ట్ ఇచ్చుకోవచ్చని తెలిపారు. పరీక్షలు చేస్తున్న ల్యాబ్ టెక్నీషియన్ లకు పూర్తి స్థాయిలో పీపీఈ కిట్స్ ఉపయోగించేలా చూడాలన్నారు. లేదంటే వారికి కరోనా సోకవచ్చు. లేదా వారి ద్వారా మిగిలిన వారికి కూడా సోకే అవకాశం ఉందన్నారు. ల్యాబ్ ల ప్రతినిధులు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి ఈటల వారికి సూచించారు.


logo