Young India Schools | హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల పేరిట ఏం జరుగుతున్నది? నిర్మాణ వ్యయం రాకెట్ వేగంతో ఎందుకు పెరిగింది? అడ్డగోలుగా అంచనాల పెంపు వెనుక మతలబేంది? దీని వెనుక ఎవరున్నారు? ఎవరి ప్రయోజనాల కోసం అంచనాలు పెంచారు? యంగ్ బడుల అంచనాలు పెంచి భారీ దోపిడీకి ప్లాన్వేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనివెనుక వేల కోట్ల కుంభకోణం దాగి ఉందన్న ఆరోపణలొస్తున్నాయి. రాష్ట్రం ప్రభుత్వం ఈ ఏడాది 78 యంగ్ ఇండియా గురుకులాలను నిర్మించనున్నది. పైలట్ ప్రాజెక్ట్‌గా కొడంగల్, మధిరలో నిర్మిస్తున్నారు. మరో 55 యంగ్ ఇండియా గురుకులాల నిర్మాణానికి ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరుచేసింది.
తాజాగా మంగళవారం 20 స్కూళ్ల నిర్మాణానికి పరిపాలన అనుమతులు జారీచేసింది. మొదట్లో రూ.85 కోట్లతో వీటిని నిర్మిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గత ఏడాది జూలైలో ప్రకటించారు. కానీ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిరుడు అక్టోబర్ 11న రూ.125 కోట్లతో రంగారెడ్డి జిల్లా కొందుర్గులో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ సూల్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. తాజాగా మంగళవారం రూ.200 కోట్లతో ఒక్కో గురుకులాన్ని నిర్మించనున్నట్టు ప్రభుత్వం జీవో జారీచేసింది. కేవలం పది నెలల కాలంలో ఒక్కో స్కూలు నిర్మాణ వ్యయాన్ని రూ.85 కోట్ల నుంచి రూ.200 కోట్లకు పెంచేశారు. అంటే మొత్తంగా 78 గురుకులాలను దాదాపు రూ.16వేల కోట్లతో నిర్మించబోతున్నారు. రూ.8వేల కోట్లు అయ్యే దానికి రూ. 16వేల కోట్లకు పెంచారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఖరారైన టెండర్లలోనూ తేడాలు
తొలి విడుతలో ఇప్పటికే కొన్ని గురుకులాల నిర్మాణానికి తెలంగాణ విద్య, సంక్షేమ మౌలిక వసతుల కల్పన సంస్థ (టీజీఈడబ్ల్యూఐడీసీ) టెండర్ల ప్రక్రియను పూర్తిచేసింది. ఇవన్నీ రాష్ట్ర మంత్రులు ప్రాతినిథ్యం వహిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గాలే. మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రాతినిథ్యం వహిస్తున్న హు స్నాబాద్‌లో నిర్మించే వైఐఐఆర్ఎస్ అంచనా వ్యయం రూ.1.35.35 కోట్లు. మరో మంత్రి జూపల్లి నియోజకవర్గం కొల్లాపూర్‌లోని గురుకులం నిర్మాణ వ్యయం రూ. 136.36 కోట్లు. మంత్రి తుమ్మల నియోజకవర్గం ఖమ్మంలో నిర్మించేదాని వ్యయం రూ. 145.59 కోట్లు. మంథనిలో రూ.139.69 కోట్లు, షాద్‌నగర్‌లో రూ. 138.40 కోట్లు, నల్లగొండలో రూ.141.39 కోట్లు, పాలేరులో రూ. 145.37 కోట్లు, ములుగులో రూ.144.75 కోట్లు. వీటి నిర్మాణానికి టీజీఈడబ్ల్యూఐడీసీ టెండర్ల ప్రక్రియను పూర్తిచేసింది. ఒక దగ్గర రూ. 125 కోట్లు, మరో దగ్గర 136 కోట్లు, ఇంకోచోట రూ.145కోట్లు. ఇదెలా అని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
అసలు వీటి అవసరమేంటి.. ?
యంగ్ గురుకులాల విషయంలో ప్రభుత్వానికి ప్రణాళికలోపం, స్పష్టత కరువయ్యిందన్న వాదనలున్నాయి. అసలు ఈ యంగ్ గురుకులాలు అవసరమా.. అన్న చర్చ జరుగుతున్నది. రాష్ట్రంలో ఇప్పటికే 1,200 గురుకులాలున్నాయి. 26వేల పైచిలుకు ప్రభుత్వ బడులున్నాయి. రాష్ట్రంలో బడిలేని ఊరులేదు. ప్రతి గ్రామంలో ప్రభుత్వ బడులున్నాయి. మళ్లీ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌ను నిర్మించాల్సిన అవసరమేంటన్న ప్రశ్నలొస్తున్నాయి. ఇప్పటికే దాదాపు రెండు వేల వరకు సర్కారు బడుల్లో ఒక్కరంటే ఒక్క విద్యార్థి కూడా లేరు. ఇవన్నీ మూసివేత దిశలో సాగుతున్నాయి. బడుల రేషనలైజేషన్ చేయాలంటూ కేంద్రం తరచుగా రాష్ర్టానికి ఆదేశాలిస్తున్నది. ఈ పరిస్థితుల్లో యంగ్ గురుకులాలు అవసరమే లేదన్న వాదనలొస్తున్నాయి.
సొంతభవనాలు కట్టొచ్చుగా..
విద్య, వైద్యం మా మొదటి ప్రాధాన్యం.. రాష్ట్ర బడ్జెట్లో విద్యకు 15శాతం నిధులను కేటాయిస్తాం అన్నది కాంగ్రెస్ పార్టీ హామీ. కానీ గత రెండు బడ్జెట్లలో కేవలం ఏడు శాతం నిధులను మాత్రమే కేటాయించింది. రాష్ట్రంలో ఇప్పటికీ టాయిలెట్లు, నీళ్లు లేని సర్కారు బడులున్నాయి. బాలురకు టాయిలెట్లు లేని స్కూళ్లు 4,740, బాలికలకు మూత్రశాలలు లేనివి 1,704 ఉన్నాయి. ఇప్పటికి విద్యుత్తు కనెక్షన్లు లేనివి స్కూళ్లు 7,472 ఉన్నాయి. యంగ్ బడులకు వెచ్చించే ఈ రూ.16వేల కోట్లతో సర్కారు బడుల్లో వసతులు కల్పించవచ్చు. గత కేసీఆర్ సర్కారు ప్రారంభించిన గురుకులాలకు సొంత భవనాలు కట్టొచ్చు. రూ. 30 -35 కోట్ల ఖర్చుచేస్తే అద్భుతమైన భవనాలు సిద్ధమవుతాయి. ఇవేవి కాకుండా ఒక్కో గురుకులానికి రూ.200 కోట్లు ఖర్చుచేయడమెందుకు అన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
పైసల్లేవంటూ.. ఆడంబరమేంది?
రాష్ర్టానికి వచ్చే ఆదాయం తగ్గింది. నన్ను కోసుకుతిన్నా రూపాయి రాలదంటూ సాక్షాత్తు సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల బహిరంగంగా ప్రకటించారు. జీతాలిద్దామన్నా.. అప్పుపుడుతలేదని, అప్పు కోసం వెళితే దొంగల్లాగా చూస్తున్నారని వ్యాఖ్యానించారు. మరి కేవలం 78 గురుకులాలకు రూ.16వేల కోట్లు ఖర్చుచేయడందేనికి అని పలువురు ప్రశ్నిస్తున్నారు. 20 ఎకరాల్లో రూ.50 కోట్ల నుంచి రూ.70కోట్లతో గత కేసీఆర్ సర్కారు ఏకంగా 25 ఇంటిగ్రేటెడ్ జిల్లా కలెక్టరేట్లను నిర్మించింది. మరి ఒక్క యంగ్ గురుకులానికి రూ. 200 కోట్లెందుకన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
ముఖ్యనేత సన్నిహితుల కోసమేనా?
యంగ్ ఇండియా బడుల అంచనాల పెంపు వెనుక ముఖ్యనేత సన్నిహితుల హస్తమున్నట్టు ప్రచారం జరుగుతున్నది. కమీషన్లు కూడా ఖరారయ్యాయన్న ఆరోపణలొస్తున్నాయి. ఓ నేత ఇప్పటికే చక్రం తిప్పేశారట. వీటి నిర్మాణాన్ని ఓ సంస్థకు అప్పగించేందుకు రంగం సిద్ధమయ్యిందట. దీంతో అడ్డగోలుగా అంచనాలు పెంచారన్న ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి.
వ్యయం పెంచు.. కమీషన్ దంచు!
జలయజ్ఞం నుంచి రెసిడెన్షియల్ సూళ్ల వరకు నిర్మాణ వ్యయాలను పెం చడం, కమీషన్లు దంచడం.. ఇదేనా కాంగ్రెస్ మారు ప్రజాపాలనా? అని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. తట్టెడు మట్టి తీయలేదుగాని నిర్మాణ వ్యయాన్ని కోట్లకు కోట్లు పెంచడం కాంగ్రెస్‌కే చెల్లిందని విమర్శించారు. ఇది యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ సూల్స్ పేరిట వేల కోట్లు దండుకునేందుకు కాంగ్రెస్ సర్కారు ఆడుతున్న మరో నాటకమని మండిపడ్డారు. ‘ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ సూళ్లను రూ.80 కోట్ల -100 కోట్లతో నిర్మిస్తామని గత ఏడాది జూలై 24న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదిలాబాద్‌లో ప్రకటించారు. కానీ, సీఎం రేవంత్‌రెడ్డి నిరుడు అక్టోబర్ 11న రూ.125 కోట్లతో రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ సూల్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వివిధ జిల్లాల్లో ఏర్పాటుచేసే ఈ సూళ్లకు ఈ నెల రెండోవారంలో రూ.135 కోట్ల-150 కోట్లతో టెం డర్లు సైతం ఖరారు చేశారు. ఈ నెల 27న 20 సూళ్ల నిర్మాణం కోసం రూ.4,000 కోట్లతో పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ జీవో నం. 96 విడుదల చేశారు. అంటే ఒకో సూల్ అంచనాలను పని మొదలు కాకుండానే మూడు రెట్లు, అంటే రూ.200 కోట్లకు పెంచారు. జలయజ్ఞం నుంచి రెసిడెన్షియల్ సూళ్ల వరకు అంచనాలను పెంచడం, కమీషన్లు దంచడం.. ఇదేనా కాంగ్రెస్ మారు ప్రజాపాలనా?’ అని హరీశ్‌రావు బుధవారం ఓ ప్రకటనలో నిలదీశారు.
తడిసిన ధాన్యాన్ని కొనండి..
ప్రభుత్వ వైఫల్యం కారణంగా రైతన్నలు వడ్లకుప్ప మీదే రాలిపోతున్నారంటూ హరీశ్‌రావు ఓ కవిత రూపంలో ఆవేదన వ్యక్తం చేశారు. తన కవితను ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. రైతన్నకు క్షమాపణ చెప్పి, వెంటనే తడిసిన ప్రతి గింజను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
యంగ్ ఇండియా గురుకులాల కాన్పెప్టే రాంగ్
నిజానికి సమీకృత గురుకులాల వ్యవస్థే రాంగ్. పేరాశతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేందుకే ఈ గురుకులాలను తెరపైకి తెచ్చారు. ఉప ముఖ్యమంత్రి గారేమో 85 కోట్లంటారు. సీఎంగారేమో రూ.125కోట్లతో చేపట్టిన భవనానికి శంకుస్థాపన చేస్తారు. ఇప్పుడేమో రూ. 200 కోట్లకు జీవోలిస్తారు. ఇదేం పద్ధతి. మన ఊరు -మన బడి పథకాన్ని ఆపేశారు. సీఎం బ్రేక్‌ఫాస్ట్‌ను ఆపేశారు. గురుకులాలను గాలికొదిలేశారు. యంగ్ గురుకులాలకు బదులు పక్కాభవనాలు లేని స్కూళ్లకు భవనాలు నిర్మిస్తే సరిపోయేది. ఇప్పటికైనా సర్కారు కండ్లు తెరిచి ప్రభుత్వ బడులను బలోపేతం చేయాలి.
-రావుల శ్రీధర్‌రెడ్డి,కార్పొరేషన్ మాజీ చైర్మన్
ఏ కాంట్రాక్ట్రర్ జేబులు నింపబోతున్నారు?
యంగ్ ఇండియన్ సంస్థ పేరుతో విరాళాలు సేకరించడం మీద రాహుల్‌గాంధీపై విచారణ జరుగుతున్నది. యంగ్ ఇండియా స్కిల్వర్సిటీ పేరుతో అదానీ, మెగా కృష్ణారెడ్డి నుంచి విరాళాలు సేకరించారు. ఇది వివాదాస్పదమయ్యింది. ఇప్పుడు యంగ్ ఇండియా గురుకులాల నిర్మాణం పేరుతో వందల కోట్ల అంచనా లు పెంచేశారు. గతంలో మూసీ ప్రక్షాళన పేరుతో పలు దఫాలు అంచనాల వ్యయం పెంచారు. యంగ్ గురుకులాల విషయంలోనూ అనుమానాలున్నాయి.
-మన్నె క్రిశాంక్, బీఆర్ఎస్ సోషల్ మీడియా