హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ): తెలంగాణ షెడ్యూల్డ్ కులాల కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్‌ను విభజించనున్నారు. మాదిగ కార్పొరేషన్, మాల కార్పొరేషన్ పేరిట రెండు వేర్వేరు సంస్థలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఎన్నికల కోడ్‌కు ముందే ప్రభుత్వం ఉత్తర్వులు సైతం జారీ చేయగా సంబంధిత అధికారులు ఆ దిశగా కసరత్తు ప్రారంభించారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా షెడ్యూల్డ్ కులాలన్నింటికీ సబ్సిడీ రుణాలను, వ్యవసాయాభివృద్ధి తదితర పథకాలను, ఎస్సీ నిరుద్యోగ యువతకు ఉపాధి శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన దళితబంధు పథకాన్ని కూడా ఎస్సీ కార్పొరేషన్ ద్వారానే క్షేత్రస్థాయిలో అమలు చేశారు. పథకం అమలు, పర్యవేక్షణ మొత్తం కార్పొరేషనే పర్యవేక్షించింది. అయితే ప్రస్తుతం ఎస్సీ కార్పొరేషన్‌ను మాదిగ, మాల కార్పొరేషన్లుగా విభజించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్నికల కోడ్‌కు ముందే ఉత్తర్వులు జారీ చేసింది. మాదిగ కార్పొరేషన్ కింద ఏయే షెడ్యూల్డ్ కులాలను చేర్చాలి, మాల కార్పొరేషన్ కింద ఏయే షెడ్యూల్డ్ కులాలను చేర్చాలి అనే అంశంపై అధికారులు సమాలోచనలు చేస్తున్నారు. కార్పొరేషన్ ఏర్పాటుకు గల నిర్దేశిత లక్ష్యాలపై కూడా మార్గదర్శకాలను సిద్ధం చేస్తున్నారు. ఎన్నికల కోడ్ ముగిసే నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని యోచిస్తున్నారు.