హైదరాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ): దళితబంధు పథకం లబ్ధిదారులను సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) ఏర్పాటు దిశగా ప్రోత్సహించేందుకు తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య (టీఐఎఫ్) నడుం బిగించింది. దళితులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆకాంక్షలను సాకారం చేసేందుకుగాను వారిని పరిశ్రమల స్థాపన దిశగా ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా కరీంనగర్ జిల్లా కలెక్టర్ సూచనల మేరకు పరిశ్రమల శాఖ సహకారంతో హుజూరాబాద్, జమ్మికుంట, వీణవంక తదితర మండలాల బ్ధిదారులకు సోమవారం బాలానగర్‌లోని ఎంఎస్ఎంఈ ఆడిటోరియంలో అవగాహనా సదస్సును ఏర్పాటుచేశారు.
దళితబంధు లబ్ధిదారులు ఎక్కువగా ట్రాక్టర్లు, ట్యాక్సీలు, కార్లు, వరికోత యంత్రాలు వంటివి కొనుగోలుచేస్తున్నారు. ఇందుకు భిన్నంగా చిన్నతరహా పరిశ్రమల ఏర్పాటు ద్వారా తాము సొంతంగా ఉపాధి పొందడమే కాకుండా పదిమందికి ఉపాధి కల్పించే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి అవసరమయ్యే సాంకేతిక సమాచారాన్ని ఇవ్వడంతోపాటు శిక్షణ, మార్కెటింగ్ సదుపాయాలపై వారికి అధికారులు, సమాఖ్య ప్రతినిధులు అవగాహన కల్పించారు. మొదటి దశలో 120 మంది లబ్ధిదారులకు అవగాహన కల్పించినట్టు, దశలవారీగా అన్ని జిల్లాలకు చెందిన లబ్ధిదారులకు ఇదే తరహా సదస్సులు నిర్వహించనున్నట్టు టీఐఎఫ్ అధ్యక్షుడు సుధీర్‌రెడ్డి తెలిపారు. గ్రామీణ, వ్యవసాయ ఆధారిత పరిశ్రమల గురించి వివరించినట్టు చెప్పారు. పరిశ్రమ వర్గాల ద్వారా మోటివేషనల్ క్లాసెస్‌ను నిర్వహిస్తామని వివరించారు. కార్యక్రమంలో టీఐఎఫ్ కార్యదర్శి ఎం గోపాల్‌రావు, ఎంఎస్ఎంఈ జిల్లా అదనపు అభివృద్ధి కమిషనర్ చంద్రశేఖర్, బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య, కరీంనగర్ జిల్లా పరిశ్రమల జీఎం నవీన్‌కుమార్, దళితబంధు కోఆర్డినేటర్ కే గణపతి తదితరులు పాల్గొన్నారు.