Cabinet Sub Committee | హైదరాబాద్, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ): డీఏ (కరువుభత్యం), పీఆర్సీ, పదోన్నతులు, బదిలీలపై నిర్ణయం తీసుకోవడంలోనూ ప్రభుత్వం తాత్సారం చేస్తున్నది. ఉద్యోగుల జేఏసీ లేవనెత్తిన సులభమైన సమస్యలను పరిష్కరించే బాధ్యతలను సైతం క్యాబినెట్ సబ్ కమిటీకి అప్పగించింది. ఈ సబ్ కమిటీకి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చైర్మన్‌గా వ్యవహరించనుండగా, మంత్రులు డీ శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ సభ్యులుగా ఉన్నారు. ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు ప్రత్యేక ఆహ్వానితులుగా, జీడీఏ ప్రిన్సిపల్ సెక్రటరీ మెంబర్ కన్వీనర్‌గా ఉంటారని ప్రభుత్వం శుక్రవారం జారీచేసిన జీవోలో వెల్లడించింది.
14 రోజుల తర్వాత.. అది అడిగితేనే
గత నెల 24న సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో జేఏసీ నేతలు తమ 54 డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు. ఈ డిమాండ్లపై ప్రభుత్వంతో చర్చించేందుకు క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తామని సీఎం అప్పట్లో ప్రకటించారు. సీఎం చెప్పిన 14 రోజులు ఆలస్యంగా క్యాబినెట్ సబ్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అది జేఏసీ నేతలు వెళ్లి అడిగిన తర్వాతే ప్రభుత్వం జీవో జారీచేసింది. సీఎం చెప్పిన తర్వాత కూడా సబ్ కమిటీని ఏర్పాటు చేయకపోవడంతో ఉద్యోగుల జేఏసీ నేతలు గురువారం సచివాలయంలో సీఎంవో అధికారులను ప్రశ్నించారు. ఇంకా సబ్ కమిటీ ఏర్పాటు చేయకపోవడంపై విస్మయం వ్యక్తం చేశారు. దీంతో ఎట్టకేలకు శుక్రవారం ప్రభుత్వం జీవోను జారీచేసింది. అయితే ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి గతంలో త్రిసభ్య కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జేఏసీ నేతలు పలు ధఫాలుగా వీరితో సమావేశమై చర్చలు జరిపారు. తాజాగా కొత్త క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయడంతో పాత కమిటీ బుట్టదాఖలు కానుండగా, గతంలో చేసిన కసరత్తు అంతా బూడిదలో పోసిన పన్నీరైంది. ఇలా పలు కమిటీల ఏర్పాటు పేరుతో సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తాత్సారం చేస్తున్నదని ఉద్యోగులు మండిపడుతున్నారు.