Inter Exams | తెలంగాణ ఇంటర్ పరీక్షలు విద్యార్థులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ప్రతిరోజూ ప్రశ్నపత్రాల్లో తప్పులు దొర్లుతున్నాయి. ఫలితంగా విద్యార్థులు మానసిక తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఇంటర్ పరీక్షల తొలిరోజునే ఇంగ్లిష్ ప్రశ్నాపత్రంలో తప్పును గుర్తించారు. తాజాగా బోటనీ పేపర్లోని 5వ, 7వ ప్రశ్నా పత్రాల్లోనూ తప్పులు దొర్లాయి. మ్యాథ్స్ 4వ ప్రశ్నలో తప్పులు వచ్చాయి. మంగళవారం జరిగిన పరీక్ష ప్రశ్నాపత్రాల్లోనూ తప్పులు పునరావృతమయ్యాయి. ప్రశ్నాపత్రాల్లోనే తప్పులు దొర్లడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మరో వైపు తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్‌పై సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తమ పిల్లలు ఇంటర్ వార్షిక పరీక్షలకు కష్టపడి సన్నద్ధమయ్యారని తప్పుల కారణంగా సరైన జవాబులు రాయలేకపోతున్నారని మండిపడుతున్నారు. రాబోయే పరీక్షల్లో తప్పులు ఆగుతాయా? రాబోయే పరీక్షల్లో కొనసాగుతాయా? అనే విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బోర్డు అధికారులు స్పందించి తప్పులు దొర్లకుండా చర్యలు తీసుకోవాలని విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు సైతం కోరుతున్నారు. ఇదిలా ఉండగా.. తెలంగాణలో ఇంటర్ పరీక్షలు మార్చి 5 నుంచి మొదలయ్యాయి. ఈ నెల 25 వరకు కొనసాగనున్నాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 4,88,448 మంది ఉండగా.. సెకండ్ ఇయర్లో 5,08,523 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. పరీక్షల కోసం 1,532 కేంద్రాలను ఏర్పాటు చేశారు.