హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ ) : మాజీ మంత్రి హరీశ్‌రావుపై నమోదైన ఫోన్‌ట్యాపింగ్ కేసును హైకోర్టు కొట్టివేయడం రేవంత్ సర్కార్‌కు చెంపపెట్టు లాంటిదని ఎస్సీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు. రాజకీయ కక్షతో హరీశ్‌రావుపై అక్రమంగా కేసు పెట్టారని హైకోర్టు తీర్పుతో తేటతెల్లమైందని శ్రీనివాస్ గురువారం ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. ప్రశ్నించే గొంతులను నొక్కేస్తూ.. ప్రతిపక్షాలపై తప్పుడు కేసులు బనాయిస్తున్న రేవంత్ సర్కారు ఇప్పటికైనా బుద్ధితెచ్చుకోవాలని ఆయన సూచించారు. హరీశ్‌రావును ఎంత అణచాలని చూస్తే.. అంత ఎత్తుకు ఎదుగుతారు తప్ప.. ప్రజాసమస్యల పోరాటంలో రాజీపడరని స్పష్టంచేశారు. ఇప్పటికైనా ప్రతిపక్షాల మీద కక్షసాధింపు చర్యలు మానుకుని.. పాలనపై దృష్టిసారించాలని కోరారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే తుది న్యాయాధిపతులు అని.. అక్రమాలు, కక్షసాధింపు పాలనను ఎప్పటికీ సమర్థించరని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికైనా రేవంత్‌రెడ్డి బురదజల్లే రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు.