హైదరాబాద్, మార్చి 25 (నమస్తేతెలంగాణ) : అసెంబ్లీ లాబీలో డిప్యూటీ సీఎం భట్టి చాంబర్ వద్ద వరంగల్ జిల్లాకు చెందిన మాజీ మంత్రులు కడియం శ్రీహరి, ఎర్రబెల్లి దయాకర్రావు, మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఎదురుపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మొదటిసారి అసెంబ్లీకి వచ్చినట్టు ఎర్రబెల్లి డిప్యూటీ సీఎం భట్టితో అన్నారు. స్పందించిన భట్టి విక్రమార్క ‘అదేంది అన్నా.. మీరందరూ రావాలి.. ఇది ప్రజా ప్రభుత్వం’ అని చెప్పారు.
ముఖ్యమంత్రికి మీరైనా చెప్పి దేవాదుల నీళ్లు ఇప్పించాలని కడియం శ్రీహరిని ఎర్రబెల్లి దయాకర్ కోరారు. ఇదే విషయంపై ఎర్రబెల్లితోపాటు చల్లా ధర్మారెడ్డి కడియంతో మాట్లాడుతుండగా.. అక్కడికి వచ్చిన జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి.. ఆయనతో ఎంటి మాట్లాడేదని అన్నారు. ఎమ్మెల్యేల అనర్హత అంశం చర్చకు రాగా.. ‘నేను ఏదైనా ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నా.. ఎర్రబెల్లి దయాకర్ మీ అందరి ముందు ఏం మాట్లాడినా.. తర్వాత నాతో మళ్లీ ఫోన్ చేసి ఏం మాట్లాడాలో అదే మాట్లాడుతారు’ అని కడియం అనడంతో అక్కడున్న వారంతా ఆశ్యర్యపోయారు.