హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కులాల సహకార అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్‌గా ఏర్పుల నరోత్తమ్‌ను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులను జారీచేసింది. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్‌గా బండా శ్రీనివాస్ పదవీ కాలం ఆగస్టు 23న ముగిసింది. ఆయన స్థానంలో నరోత్తమ్ నియమితులయ్యారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం పస్తాపూర్‌కు చెందిన నరోత్తమ్ ఉస్మానియాలో ఇంజినీరింగ్ పూర్తిచేశారు. ఇరిగేషన్ శాఖలో ఏఈగా, డీఈగా సేవలు అందించారు. ఉద్యోగాన్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చిన నరోత్తమ్.. 2009లో జహీరాబాద్ నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయారు. స్నేహ ఫౌండేషన్ స్థాపించి స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను చేశారు. ఆయన సేవలను గుర్తించిన సీఎం ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించారు.
కార్పొరేషన్ చైర్మన్‌గా నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను నరోత్తమ్‌కు వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు శుక్రవారం అందజేశారు. తనకు చైర్మన్‌గా అవకాశం కల్పించినందుకు సీఎం కేసీఆర్‌కు నరోత్తమ్ ధన్యవాదాలు తెలియజేశారు. మంత్రి హరీశ్‌రావుకు రుణపడి ఉంటానన్నారు. రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం కృషి చేస్తానని చెప్పారు.