హైదరాబాద్ సిటీబ్యూరో, మే 28(నమస్తే తెలంగాణ): టీజీఎస్పీడీసీఎల్లో సామగ్రి కొనుగోళ్లలో కమీషన్ల దందాపై నమస్తే తెలంగాణలో బుధవారం ప్రచురితమైన ‘మిస్టర్ టెన్ పర్సెంట్’ కథనం సంచలనంగా మారింది. సీఎండీ ముషారఫ్ ఫారుఖీ బుధవారం ముఖ్యవిభాగాల చీఫ్ ఇంజినీర్లతో సమీక్ష నిర్వహించారు. 33 కేవీ కేబుల్ కొనుగోలు, 10 శాతం కమీషన్ వ్యవహారం బయటికి ఎలా తెలిసిందని అధికారులు ఆరా తీసినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. దీంతోపాటు సంస్థ స్టోర్స్‌లో సామగ్రి నిల్వలపై చర్చించినట్టు సమాచారం. కేబుల్ లేక నిలిచిపోయిన పనులపై వివరాలు అడిగారని, సంబంధిత అధికారులను, కాంట్రాక్టర్లను ప్రశ్నించారని తెలిసింది.
మిస్టర్ 10% కు కమీషన్ ముట్టజెప్పి కేబుల్ కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్ తెచ్చుకునే పరిస్థితి లేకపోవడంతో, డిస్కంకు 33కేవీ కేబుల్ పెద్దగా అవసరం పడబోదు కాబట్టి కొనుగోలు చేయలేమంటూ అధికారులు చేతులెత్తేసినట్టు తెలిసింది. ప్రత్యామ్నాయంగా సంబంధిత కాంట్రాక్టర్లు, ఏజెన్సీలే కేబుల్ తెచ్చుకోవాలంటూ వారిపై భారం మోపాలని చూస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపా యి. అయితే ఏ రేటుకు తెచ్చుకోవాలో, ఏ కంపెనీ నుంచి తేవాలో తేల్చలేదని తెలిసింది. దీంతో కాంట్రాక్టర్లు, ఏజెన్సీలు, ఆయా పనులకు సంబంధించిన అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇదే సమయంలో మిస్టర్ టెన్ పర్సెంట్‌కు ఎలా వివరణ ఇవ్వాలో తెలియక మల్లగుల్లాలు పడుతున్నట్టు ఎస్పీడీసీఎల్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
కేబుల్ లొల్లి సద్దుమణగక ముందే ఎస్పీడీసీఎల్లో కొత్త వివాదం తెరమీదికి వచ్చింది. 25 కేవీ డీటీఆర్లను (డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్) ఇష్టానుసారంగా రాజకీయ ఒత్తిడిలకు తలొగ్గి పెద్దల నియోజకవర్గాలకు సరఫరా చేస్తున్నారంటూ కాంట్రాక్టర్లు, వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా స్టోర్‌కు ఇటీవల 150 డీటీఆర్లు రాగా, అందులో 40 ట్రాన్స్ఫార్మర్లను సీఎం రేవంత్‌రెడ్డి నియోజకవర్గమైన కొడంగల్‌కే పంపించినట్టు చెప్తున్నారు.
వానకాలం సీజన్లో 25 కేవీ డీటీఆర్లు రైతులకు చాలా ముఖ్యం. వాస్తవానికి ‘ముందుగా దరఖాస్తు చేసుకున్నవారికి మొదట’ పద్ధతిలో డీటీఆర్లను కేటాయిస్తుంటారు. కానీ నెలల కిందటే డీడీలు కట్టినవారిని పక్కనబెట్టి ఒక్క నియోజకవర్గానికే పెద్ద ఎత్తున ట్రాన్స్ఫార్మర్లు పంపి స్వామిభక్తి చాటుకుంటున్నారని చర్చ జరుగుతున్నది. దీంతో సీజన్ మొత్తం నష్టపోవాల్సి వస్తుందని అధికారుల వద్ద రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. ఈ విషయంపై స్టోర్స్ అధికారులను ఆరా తీయగా.. పద్దతి ప్రకారమే పంపిణీ చేస్తున్నామని, కొడంగల్‌కు అనుమతులు ఉన్నాయి కాబట్టే ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చామని తెలిపారు.
కేబుల్ లేక నిలిచిన పనులపై సీఎండీ సంబంధిత ఏరియా అధికారులతో మాట్లాడినట్టు సమాచారం. ముఖ్యంగా జూబ్లీ బస్‌స్టాండ్‌లో చార్జింగ్ స్టేషన్ పనులపై ఆర్టీసీ అధికారులతోనూ ఆరా తీసినట్టు తెలిసింది. అనంతరం ఏజెన్సీతో మాట్లాడారని, వారంరోజుల్లో పనులన్నీ పూర్తిచేయాలని ఆదేశించారని విద్యుత్ శాఖ అధికారి ఒకరు తెలిపారు. సమ్మర్ యాక్షన్ పనులు ముందుకు కదలకపోవడంపైనా చర్చ జరిగిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
అవి ముందస్తు జాగ్రత్తగా చేపట్టే పనులే తప్ప, అత్యవసర పనులు కావని అధికారులు సమాధానం ఇచ్చినట్టు తెలిసింది. వాస్తవానికి ఎండాకాలంలో ఓవర్‌లోడ్ పడకుండా అత్యవసరంగా పూర్తి చేసేందుకు అధికారులు టెండర్లు పిలిచి, మార్చిలోనే కాంట్రాక్టర్లతో ఒప్పందాలు చేసుకున్నారు. అయితే 33 కేవీ కేబుల్ కొనుగోలుకు ‘పెద్దల’ అనుమతి రాకపోవడంతో ఎవరి కేబుల్ వారే తెచ్చుకోవాలని ఏప్రిల్ చివరి వారంలో చెప్పినట్టు కాంట్రాక్లర్లు వాపోతున్నారు. ఈ అంశంపైనా తాజా సమావేశంలో స్పష్టత రాలేదని సమాచారం.