యాదగిరిగుట్ట, జూలై 19: టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ అతిశీఘ్ర దర్శన తరహాలో యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో రూ. 5వేలతో ‘గరుడ ప్యాకేజీ’ని ప్రవేశపెట్టనున్నట్టు ఈవో వెంకట్రావు శనివారం మీడియాకు వెల్లడించారు. గరుడ టికెట్‌పై ఒక్కో భక్తుడికి సుప్రభాత సేవ నుంచి శయనోత్సవ వేళ వరకు ఏ సమయంలోనైనా దర్శించుకునే వీలు కల్పిస్తున్న ట్టు తెలిపారు. అంతరాలయ ప్రవేశం కల్పించడంతోపాటు స్వామివారి వేదాశీర్వచనం, శెల్లా, కనుము, 5 లడ్డూ లు, కేజీ పులిహోర, కొండపైకి వాహన అనుమతి ఉంటుందని చెప్పారు.
ఈ ఏడాది దేవస్థానం ఆధ్వర్యంలో రూ. 20 కోట్లతో 4 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ, 4 మెగావాట్ల సోలార్ పవర్ పాయింట్లను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. కొండపైన భద్రతకు 50 మంది సెక్యూరిటీ సిబ్బందిని తీసుకురానున్నట్లు తెలిపారు. సత్యనారాయణ వ్రతానికి రూ. 800 ఉండగా రూ.1000కు పెంచనున్నట్టు చెప్పారు. కొండచుట్టూ ఏర్పాటు చేసే శ్రీఆంజనేయ, గరుడ, ప్రహ్లాద, రామానుజ, యాదమహర్షి విగ్రహాలకు రూ.3.6 కోట్లు ఖర్చు అవుతుందని ఆర్కిటెక్ట్, స్థపతులు, ఇంజినీర్లు అంచనా వేశారని ఆయన పేర్కొన్నారు.