హైదరాబాద్ : వాతావరణ మార్పులతో ప్రపంచానికి పర్యావరణ ముప్పు పొంచి ఉందని ప్రముఖ పర్యావరణ శాస్త్రవేత్త డాక్టర్ పురుషోత్తం రెడ్డి హెచ్చరించారు. స్కాట్లాండ్లోని గ్లాస్గో నగరంలో ఈనెల 31 నుంచి నవంబర్ 12 వరకు జరిగే కాప్ 26 సదస్సు జరుగనుంది. ఆ సదస్సులో పాల్గోనే 194 దేశాలు వివిధ అంశాలపై జరిగే చర్చలు, ఒప్పందాల సమాచారాన్ని ప్రజల్లోకి విస్త్రుతంగా తీసుకెళ్లాలనే లక్ష్యంతో రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం అన్నాస్ పల్లిలో మంగళవారం ఎర్త్ సెంటర్లో సన్నాహాక సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా పర్యావరణ శాస్త్రవేత్తలు డాక్టర్ తులసీ రావు, డాక్టర్ సాయిభాస్కర్, డాక్టర్ ఉమా మహేశ్వర్ రెడ్డి, మాజీ సమాచార హక్కు కమిషనర్ దిలీప్ రెడ్డి, ఎర్త్ సెంటర్ చైర్మన్ లక్ష్మారెడ్డి, అధ్యక్షురాలు లీలారెడ్డి తదితరులతో కలిసి పురుషోత్తం రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రస్తుతం పెరిగిన 2 డిగ్రీల భూతాపంతో ప్రపంచం వ్యాప్తంగా పెను విపత్తులు సంభవించాయని పేర్కొన్నారు. పలు దేశాలు తగలబడిపోయాయన్నారు.
చాలా కాలంగా చోటు చేసుకుంటున్న పర్యావరణ విధ్వంస ఫలితమే కరోనా వంటి మహమ్మారికి కారణమన్నారు. పర్యావరణ విధ్వంసం వల్ల ప్రపంచంలోని పలు లోతట్టు దేశాలు, నగరాలు ముంపుకు గురవుతాయని, ఆ జాబితాలో బంగ్లాదేశ్, ముంబాయి, కోల్కతా, చెన్నై, విశాఖ, కాకినాడ వంటి పట్టణాలు ఉన్నాయని డాక్టర్ తులసీరావ్ హెచ్చరించారు.
ఇలాంటి ప్రమాదాలను అరికట్టేందుకు కాప్-26 వేదికగా పలు కఠిన నిర్ణయాలు తీసుకుంటారని, వాటిని క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరవేసేలా ఎర్త్ సెంటర్ 12 రోజులు పలు కార్యక్రమాలను నిపుణలతో నిర్వహించనున్నట్లు దిలీప్ రెడ్డి తెలిపారు. గ్లాస్కోలో జరిగే చర్చల అంశాలను ఎప్పటికప్పుడు విశ్లేషించి ఎర్త్ సెంటర్ ద్వారా ప్రజలకు అందిస్తామని డాక్టర్ సాయి భాస్కర్ వెల్లడించారు.