హైదరాబాద్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ): నగరంలో బుధవారం జరగబోయే టీఆర్ఎస్ పార్టీ 21వ వార్షికోత్సవ సభకు హాజరు కావాలంటే ప్రత్యేక బార్కోడ్ పాస్ ఉండాల్సిందే. పార్టీ ప్రతినిధులందరికీ ఈ తరహా పాసులు జారీచేశారు. దేశంలోనే రాజకీయ సమావేశాలకు ఈ పాసులు ఇవ్వడం తొలిసారి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రతినిధులు సభలోపలికి వెళ్లే ప్రధాన ద్వారం వద్ద తమకు పార్టీ ఇచ్చిన బార్కోడ్ పాసును చూపించాల్సి ఉంటుంది. బార్‌కోడ్‌ను స్కాన్ చేయడానికి సభా ప్రాంగణంలో 20 స్కానింగ్ యంత్రాలను ఏర్పాటు చేశారు. స్కాన్ చేసిన వెంటనే పాస్ జారీ అయినవారి వివరాలు అక్కడ కనిపిస్తాయి. వారిని సభా ప్రాంగణంలో వారికి కేటాయించిన ప్రాంతంలో కూర్చోబెడ్తారు. వీఐపీ, వీవీఐపీ, ఎన్ఆర్ఐలు..మీడియా వంటి విభాగాలకు విడిగా పాస్‌లు ఇచ్చారు.
సోషల్ మీడియాపై అవగాహనకు ప్రత్యేక విభాగం
సభకు వచ్చే ప్రతినిధులకు సోషల్ మీడియాపై అవగాహన కోసం ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ సోషల్ మీడియా ప్రభావాన్ని వివరిస్తారు. టీఆర్ఎస్ సోషల్ మీడియా ఇప్పటివరకు చేసిన పలు కార్యక్రమాల గురించి కూడా వివరిస్తారు. ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాంలలో టీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ఉందో.. సోషల్ మీడియా ద్వారా ఎలా చేరుకోవాలన్నదానిపై వివరిస్తామని రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ మన్నె క్రిషాంక్ చెప్పారు.
33 రకాల వంటలు
సభకు హాజరయ్యే వారి కోసం కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ కూర్మయ్య గారి నవీన్ కుమార్ ఆధ్వర్యంలో భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. 33 రకాల వంటకాలను సిద్ధం చేస్తున్నారు. సభా ప్రాంగణంలో 15 వందల ఫొటోలతో ఒక గ్యాలరీని ఏర్పాటు చేశారు.