హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ) : ఓటర్లు తమ నమోదు ఫారాలను అధికారిక పోర్టల్ (voters.eci.gov.in) ద్వారా ఆన్లైన్లో సమర్పించేలా విస్తృత ప్రచారం కల్పించాలని కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్యకార్యదర్శి అవినాశ్‌కుమార్, ఉప కార్యదర్శి సంజయ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. ‘సర్’ ప్రక్రియపై ఓటర్లు వేగంగా సమాచారం పొందేందుకు అందుబాటులో ఉన్న ‘బుక్ ఏ కాల్’ సదుపాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
తెలంగాణలో ఫేజ్-3 ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సర్వే(సర్) సన్నద్ధతపై హైదరాబాద్‌లోని బీఆర్కేఆర్ భవన్ కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. తెలంగాణ సీఈవో సీ సుదర్శన్‌రెడ్డి అసెంబ్లీ నియోజకవర్గాల వివరాలను, ఈ సమీక్ష ప్రక్రియ కోసం కేటాయించిన సిబ్బంది వివరాలు, హెల్ప్డెస్ల ఏర్పాటును ఈసీఐ అధికారులకు వివరించారు.