హైదరాబాద్, జనవరి10 (నమస్తే తెలంగాణ): చివరి ఆయకట్టుకు తగినంత నీరందించాలని ఇరిగేషన్‌శాఖ అధికారులను సాగునీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఆదేశించారు. ఎస్సారెస్పీ ప్రాజెక్టు పరిధిలోని చివరి ఆయకట్టుకు తగినంత నీరు రావడం లేదని రైతులు ఇప్పటికే స్థానిక నేతల దృష్టికి తీసుకువస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎస్సారెస్పీ సాగునీటి విడుదలపై జలసౌధలో ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని మంత్రి ఉత్తమ్ శుక్రవారం నిర్వహించారు. నీటిపారుదలశాఖ కార్యదర్శి రాహుల్‌బొజ్జా, ఈఎన్సీలు అనిల్‌కుమార్, విజయభాసర్‌రెడ్డి, హరిరాం, సీఈలు కే శ్రీనివాస్, సుధాకర్‌రెడ్డి, రమేష్‌బాబును క్షేత్రస్థాయి పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. ఎస్సారెస్పీ పరిధిలో యాసంగి సీజన్లో మొత్తం 9.68 లక్షల ఎకరాలకు నీరందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నీటి సరఫరా ఏప్రిల్ 8 వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు.
కృష్ణాజలాల సరఫరాపై వారంలో నివేదిక
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జనవరి 10 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌కు నిరవధికంగా కృష్ణాజలాల సరఫరాకు నీటిపారుదల శాఖ, జలమండలి అధికారులు వారంలోగా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో వారు ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టును త్వరలో సందర్శించనున్నారు. నగర నీటి సరఫరాకు ఇబ్బంది లేకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఇటీవల సీఎం తన సమీక్షలో ఆదేశించారని జలమండలి అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నిర్ణీత నీటిమట్టం తర్వాత సుంకిశాల ప్రాజెక్టులోని మధ్య టన్నెల్‌ను మూసివేయడంతోపాటు ఇన్‌టేక్ వెల్‌లోని నీటిని తోడేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. నిరుడు ఆగస్టులో జరిగిన ఘటన తర్వాత చేపట్టాల్సిన పనులపై నివేదిక కోసం టీసీఈ అనే కన్సల్టెన్సీని నియమించామని, ఆ నివేదిక ప్రకారం నిర్మాణ సంస్థ తన సొంత ఖర్చులతో పనులను చేపట్టనున్నట్టు ధ్రువీకరణ ఇచ్చిందని జలమండలి అధికారులు తెలిపారు.