హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): ఆదివాసీ, గిరిజన విద్యార్థులు ఇంగ్లిష్ మీడియంలో చదివినా మాతృభాష, సంస్కృతిని భవిష్యత్ తరాలకు అందించేందుకు పాఠ్యప్రణాళికలో వారి సంస్కృతి ప్రతిబింబించే చర్యలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని ఉట్నూరు, ఏటూరునాగారం, భద్రాచలం, మన్ననూరు ఐటీడీఏల పరిధిలో నివసించే గోండు, కోయ, కొలాం, మైదాన ప్రాంతాల్లోని బంజారా, ఎరుకల తెగల భాషా సంస్కృతుల పరిరక్షణ కోసం సర్కార్ ఇప్పటికే అనేక చర్యలు చేపట్టింది.
ఈ విద్యా సంవత్సరం నుంచి ఏజెన్సీ, మైదాన ప్రాంతాల్లోని అన్ని పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో విద్యాబోధన ప్రారంభించింది. తెలుగు మీడియం నుంచి ఇంగ్లిష్ మీడియం స్కూళ్లుగా మార్చినా పూర్వ ప్రాథమిక విద్యార్థులకు అందించే ప్రైమర్స్ను వారి భాషలోనే కొనసాగించే చర్యలు చేపట్టింది.
ఇంగ్లిష్ మీడియం రాకతో పూర్వ ప్రాథమికస్థాయి విద్యార్థుల ఇంటి భాషకు, బడి భాషకు మధ్య అంతరం ఏర్పడి వారు బడికి దూరంగా ఉండే పరిస్థితులున్నాయని గ్రహించిన గిరిజన సంక్షేమశాఖ ప్రస్తుత ప్రైమర్స్ను సైతం ఇంగ్లిష్‌లోకి తర్జుమా చేయించింది. గోండు, కొలాం, కోయ, బంజారా భాషల్లో ఉన్న ప్రైమర్స్కు అదనంగా మైదాన ప్రాంతాల్లోని ఎరుకల తెగకు చెందిన విద్యార్థుల కోసం వారి మాతృభాషలో ప్రైమర్స్ను రూపొందించింది. వీటిని గిరిజన ప్రాంతాల్లోని 326 ఆశ్రమ, 1,432 ప్రభుత్వ పాఠశాలల్లో పంపిణీ చేస్తున్నారు.