హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఈ ఏడాది లిఫ్ట్ పథకాలు అంతంతమాత్రంగానే పనిచేశాయి. వరద ప్రవాహాలు జోరుగా సాగినా పంప్‌హౌస్‌లు మాత్రం సామర్థ్యం మేరకు పనిచేయలేదు. ఇందుకు కారణం సర్కార్ నిధులివ్వకపోవడమే. విద్యుత్తు బకాయిలు విడుదల చేయకపోవడంతో ట్రాన్స్‌కో విద్యుత్తు సరఫరాలో కోత పెట్టింది. పగటిపూట మాత్రమే విద్యుత్తు సరఫరా చేస్తుండగా.. పంప్‌హౌస్‌లు కేవలం కొన్ని గంటలు మాత్రమే పనిచేసే దుస్థితి నెలకొన్నది. వెరసి ఆయా పంప్‌హౌస్‌ల పరిధిలోని ఆయకట్టుకు సాగునీరందని పరిస్థితి. మరోవైపు మోటర్లపై తీవ్ర ఒత్తిడి పడే అవకాశముందని ఇంజినీర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నత్తనడకన ఎత్తిపోతలు
ఎత్తిపోతల పథకాలు ఏడాదిలో 90 నుంచి 180 రోజుల వరకు మాత్రమే పనిచేస్తాయి. నీటివనరుల్లోకి వరద ప్రవాహాలు కొనసాగిన సమయంలో, యాసంగి ప్రారంభం నుంచి పంప్‌హౌస్‌లు నిరంతరాయంగా పనిచేయాలి. అప్పుడే ఆయా ప్రాజెక్టుల పరిధిలోని ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. రాష్ట్రంలో ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్ట్‌తోపాటు కల్వకుర్తిలోని 4 పంపింగ్ స్టేషన్లు, రాజీవ్భీమాలోని 4 పంపింగ్ స్టేషన్లు, నెట్టెంపాడులోని 3 పంపింగ్ స్టేషన్లు, కోయిల్‌సాగర్, అలీసాగర్, గుత్పా, చౌటుపల్లి హన్మంతరెడ్డి, దేవాదుల తదితర పంపింగ్ స్టేషన్లు అత్యంత కీలకం. ప్రధాన ఆయకట్టు ఆయా పంప్‌హౌస్‌ల దిగువనే ఉన్నది. కానీ, ఈ ఏడాది పంప్‌హౌస్‌ల్లో మోటర్లు సక్రమంగా పనిచేయని దుస్థితి నెలకొన్నది. కేవలం 12 గంటలు, అది కూడా పగటిపూట మాత్రమే పనిచేస్తున్న పరిస్థితి. ఇందుకు ప్రధాన కారణమేంటంటే సర్కార్ సకాలంలో పెండింగ్ బిల్లులు విడుదల చేయకపోవడమే. విద్యుత్తు సప్లయ్‌కి సంబంధించి బిల్లులే దాదాపు రూ.27,027కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. పంపిం గ్ స్టేషన్ల ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్‌కు సంబంధించి రూ.1,745 కోట్లు బకాయి ఉన్నాయి.
నిర్వహణ బిల్లులదీ అదే పరిస్థితి
పంప్‌హౌస్‌ల నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వం ఏజెన్సీలకు అప్పగిస్తుంది. ఆయా పంప్‌హౌస్‌ల నిర్వహణకు కావాల్సిన హెల్పర్లు, వెల్డర్లు, మజ్దూర్లు, పంపింగ్ స్టేషన్ మేనేజర్, సెక్యూరిటీ, ఎలక్ట్రీషియన్, మెకానిక్, పైప్లైన్ల పర్యవేక్షణను ఏజెన్సీలే నిర్వహిస్తాయి. అయితే ఏజెన్సీలకు సైతం సకాలంలో నిధులు విడుదల చేయలేని దుస్థితి నెలకొన్నది. దీంతో సిబ్బందికి సకాలంలో జీతాలు చెల్లించలేని పరిస్థితి. పంపులను పదే పదే ఆన్, ఆఫ్ చేయాల్సి రావడంతో ఇంజినీర్లు సైతం తీవ్ర ఆందోళనలకు గురవుతున్నారు. ప్రతిసారీ ఆన్ ఆఫ్‌తో మోటర్లో తీవ్రమైన కంపనాలు వస్తుంటాయని తెలిపారు.
