హైదరాబాద్, అక్టోబర్15 (నమస్తే తెలంగాణ): నీటిపారుదలశాఖ (Irrigation Department) హైదరాబాద్ యూనిట్లో తాజాగా జరిగిన బదిలీలపై ఇంజినీర్లు (Engineers Transfers) నిప్పులు చెరుగుతున్నారు. అనుయాయులకు అందలం ఎక్కేందుకు సంబంధంలేని ఇంజినీర్లను బలిపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్రమాలకు పాల్పడ్డారంటూ ఆరోపణలను వచ్చినవారిని, వందల ఎన్వోసీ (నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్)లను జారీ చేసిన ఇంజినీర్లను మినహాయించి, ఒక్క ఎన్వోసీని కూడా జారీ చేయని వారిని కూడా బదిలీ చేయడమేంటని మండిపడుతున్నారు. ‘ఇదేమీ సర్కారు.. ఇవేమి బదిలీలు’ అంటూ సర్కారు తీరును తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఈఎన్సీని కలిసి మొరపెట్టుకున్నారు. అయినప్పటికీ బదిలీలు ప్రభుత్వ నిర్ణయమేనని, చేసేదేమీలేదని ఆయన బదులివ్వడంతో సర్కారు తీరుపై ఇంజినీర్లు నిప్పులు చెరుగుతున్నారు.
సూత్రధారులను వదిలి పెట్టి..!
ఇరిగేషన్‌శాఖలో హైదరాబాద్ సీఈ యూనిట్ పరిధిలో తాజాగా ఒకేసారి 55 మందిని బదిలీ చేశారు. ఎస్ఈ మొదలుకొని పలువురు ఈఈ, డీఈఈ, ఏఈఈ, ఏఈల వరకు అందరినీ ఇతరచోట్లకు ఓడీలపై (ఆఫీసర్ ఆన్ డ్యూటీ)పై బలవంతంగా సాగనంపారు. అయితే ఇందులో అసలు ఎన్వోసీల జారీకి సంబంధించి అక్రమాలకు సూత్రధారులని ఆరోపణలను ఎదుర్కొంటున్న ప్రధాన ఇంజినీర్లను మినహాయించడమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ యూనిట్లో 3 డివిజన్లు ఉండగా, ఒక్కో డివిజన్ పరిధిలో 2 చొప్పున సబ్ డివిజన్లు ఉన్నాయి.
ఇందులో చేవెళ్ల డివిజన్ అత్యంత కీలకమైంది. అందులోనూ చేవెళ్ల, శంకర్పల్లి తదితర ఏరియాలు ఇంకా ముఖ్యమైనవి. అత్యధిక ఎన్వోసీలు ఇక్కడి నుంచే జారీ చేస్తున్నారనేది అధికారులందరికీ తెలిసిన విషయం. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఎన్వోసీల జారీలో అవినీతి ఆరోపణలు బయటకురావడానికి ప్రధాన కారణం చేవెళ్ల డివిజనే. ఎన్వోసీల తీరుపై పలు పత్రికల్లో కథనాలు వచ్చాయి. తాజాగా సర్కారు మొత్తం హైదరాబాద్ యూనిట్ ప్రక్షాళన పేరిట భారీగా బదిలీలను చేసింది. కానీ అవినీతి ఆరోపణలకు సూత్రధారులైన పలువురు ఇంజినీర్లను యథాతథంగా కొనసాగించడం, సంబంధమేలేని ఇతర ఇంజినీర్లను బదిలీలు చేయడమే చర్చనీయాంశంగా మారింది.
సంబంధమే లేని ఇంజినీర్లు బలి
హైదరాబాద్ పరిధిలో సుదీర్ఘకాలంపాటు పనిచేస్తున్న వారిని బదిలీ చేశారంటే అర్థముందని ఇంజినీర్లు చెప్తున్నారు. కానీ తాజా బదిలీల్లో ఎన్వోసీలతో సంబంధం లేనివారిని, ఇటీవలే ఓడీలపై హైదారాబాద్‌కు వచ్చిన వారిని కూడా సర్కారు బలి చేసిందని మండిపడుతున్నా రు. కొందరు అనారోగ్య కారణాలు, వ్యక్తిగత అవసరాల రీత్యా ఓడీపై ఇతర యూనిట్లు, సర్కిళ్ల నుంచి ఇక్కడికి వచ్చారు. కొందరు ఏడాది క్రితం రాగా, మరికొందరు వచ్చి 6 నెలలు కూడా పూర్తికాలేదు. కానీ సర్కారు తాజా బదిలీల్లో వారిని సైతం సాగనంపింది. దీంతో బాధిత ఇంజినీర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణం పునఃసమీక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
అనుయాయుల కోసమే బదిలీ నాటకం
హైదరాబాద్ యూనిట్లో ప్రస్తుత బదిలీల వెనక భారీ కుట్ర దాగి ఉన్నదని జలసౌధవర్గాలు చెప్తున్నాయి. అనుయాయులను అందలం ఎక్కించేందుకే బదిలీలకు తెరతీశారని విమర్శిస్తున్నారు. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు కేటాయించిన ఏపీ ఇంజినీర్‌కు ప్రస్తుతం హైదరాబాద్ యూనిట్లో కీలకమైన స్థానం కట్టబెట్టారు. ఆయన మీద గతంలో అనేక ఆరోపణలున్నాయని తెలిసింది. ఎన్వోసీల జారీలో ఆరోపణలను అదునుగా చూసుకుని కొందరు ఉన్నతాధికారులే ప్రక్షాళన పేరిట బదిలీల నాటకానికి తెరతీశారని జలసౌధలో విమర్శలు ఉన్నాయి.