ఇబ్రహీంపట్నంరూరల్, జనవరి 16 : ఉన్నత చదువుల కోసం ప్రైవేట్ వసతిగృహంలో ఉంటున్న ఇంజినీరింగ్ విద్యార్థినిపై కన్నేసిన ఓ కామాంధుడు.. మద్యం మత్తులో ఆమెపై లైంగిదాడికి పాల్పడ్డాడు. హాస్టల్లో ఒంటరిగా ఉండటాన్ని అదునుగా చేసుకొని అఘాయిత్యానికి ఒడిగట్టాడు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పరిధిలోని మంగల్‌పల్లి సమీపంలో ఉన్న ఓ హాస్టల్లో బుధవారం రాత్రి ఈ ఘటన జరుగగా ఆలస్యంగా వెలుగుచూసింది.
పోలీసుల వివరాల ప్రకారం.. మంగల్‌పల్లి సమీపంలోని హాస్టల్లో ఉంటూ ఓ విద్యార్థిని స్థానిక కళాశాలలో ఇంజినీరింగ్ చదువుతున్నది. అదే భవనం గ్రౌండ్ ఫ్లోర్లో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారికి చెందిన కార్యాలయం ఉన్నది. రియల్ ఎస్టేట్ వ్యాపారి వద్ద నల్లగొండ జిల్లా గుర్రంపోడ్ మండలం జొన్నాయిచింత గ్రామానికి చెందిన అజిత్ (22) డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.
సంక్రాంతి పండుగ సందర్భంగా హాస్టల్ భవనం పైఅంతస్తులోని గదిలో పలువురితో కలిసి అజిత్ దావత్ చేసుకున్నాడు. సదరు విద్యార్థిని, బుధవారం రాత్రి హాస్టల్ మొదటి అంతస్తులో ఒంటరిగా కనిపించడం చూసి బలవంతంగా గదిలోకి ఎత్తుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నిందితుడిపై కేసు నమోదు చేసినట్టు ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు తెలిపారు.