మన్సూరాబాద్, సెప్టెంబర్ 3: హైదరాబాద్‌లో ఓ యువకుడు తెగబడ్డాడు. ప్రియురాలు తనను పట్టించుకోవడం లేదన్న కోపంతో ఆమె ఇంటికి వెళ్లి కత్తితో దాడిచేశాడు. అడ్డుకోబోయిన యువతి సోదరుడిపైనా విచక్షణ రహితంగా దాడిచేయడంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. యువతి ప్రాణాలతో బయటపడింది. ఎల్బీనగర్లోని ఆర్టీసీ కాలనీలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. షాద్‌నగర్‌లోని కొందుర్గుకు చెందిన సురేందర్‌గౌడ్-ఇందిర దంపతులు ఎల్బీనగర్లోని ఆర్టీసీ కాలనీలో రెండేండ్లుగా ఓ ఇంట్లో కిరాయికి ఉంటున్నారు. వీరికి సంఘవి (24), పృథ్వీతేజ (22) రోహిత్ సంతానం. సంఘవి రామాంతపూర్‌లోని హోమియోపతి దవాఖానలో నాలుగో ఏడాది చదువుతుండగా, బీటెక్ పూర్తిచేసిన పృథ్వీ ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు.
ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో నిందితుడు శివకుమార్ (26) వారింటికి వచ్చాడు. ఆ సమయంలో ఇంట్లో సంఘవి, పృథ్వీ మాత్రమే ఉన్నారు. వచ్చీ రావడంతో సంఘవితో గొడవపడ్డాడు. ఆపై వెంట తీసుకొచ్చిన కత్తులతో దాడికి యత్నించాడు. అక్కడే ఉన్న పృథ్వీ అడ్డుకునే ప్రయత్నం చేయగా కత్తితో అతడి ఛాతీపై బలంగా పొడిచాడు. తీవ్రంగా గాయపడిన పృథ్వీతేజ గాయం నుంచి రక్తం బయటకు రాకుండా చేత్తో అదిమిపట్టి బయటకు వచ్చి పక్కింట్లో ఉండే ఝాన్సీ అనే మహిళకు విషయం చెప్పి రోడ్డుపైకి పరుగులు తీశాడు. మరోవైపు, పృథ్వీ బయటకు వెళ్లిపోవడంతో సంఘవిని బెడ్రూంలోకి తీసుకెళ్లిన శివకుమార్ దాడికి పాల్పడ్డాడు. ఝాన్సీ ఇచ్చిన సమాచారంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఘటనా స్థలానికి వస్తూ మార్గమధ్యంలో స్పృహతప్పి పడిపోయిన పృథ్వీని ఎల్బీనగర్లోని కామినేని దవాఖానకు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు చనిపోయినట్టు ధ్రువీకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా దవాఖానకు తరలించారు.
ఝాన్సీ సాహసంతో నిలిచిన సంఘవి ప్రాణాలు
పృథ్వీ చెప్పడంతో అప్రమత్తమైన ఝాన్సీ వెంటనే వారింటికి వెళ్లి బయటి నుంచి గడియపెట్టింది. సంఘవిని వదిలిపెట్టాలని, లేదంటే బయటకు వెళ్లలేవని హెచ్చరించడంతో ఆమెను వదిలేశాడు. ఈలోగా పోలీసులు అక్కడికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఝాన్సీ చొరవతో గాయాలతో బయటపడిన సంఘవిని చికిత్స కోసం కామినేని దవాఖానకు తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి ఉస్మానియాకు తరలించారు.
ప్రేమ వ్యవహారమే కారణం
రామంతాపూర్‌లో ఉంటూ ఆర్టిస్ట్‌గా పనిచేస్తున్న శివకుమార్‌కు సంఘవికి మధ్య పదో తరగతి నుంచే ప్రేమ వ్యవహారం కొనసాగుతున్నదని ఎల్బీనగర్ సీఐ అంజిరెడ్డి తెలిపారు. ఇటీవల ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో సంఘవి అతడిని దూరంపెట్టింది. దీనిని తట్టుకోలేకపోయిన శివకుమార్ పథకం ప్రకారం ఆదివారం ఆమె ఇంటికి వెళ్లి దారుణానికి పాల్పడ్డాడు. నిందితుడు శివకుమార్ కూరగాయలు కోసే కత్తితో దాడికి పాల్పడినట్టు ఎల్బీనగర్ డీసీపీ బీ సాయిశ్రీ తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, దాడి వెనక కారణం విచారణలో తేలుతుందని పేర్కొన్నారు.