BTech Admissions | హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ) : ఇంజినీరింగ్ కోర్సుల్లో మొత్తం సీట్లు నిండేనా..? అంటే అనుమానంగానే కనిపిస్తున్నది. చాలా కాలంగా బీటెక్‌లో మొత్తం సీట్లు నిండటంలేదు. కన్వీనర్ కోటా, మేనేజ్మెంట్ కోటా కలిపితే 12వేల సీట్లు మిగులుతున్నాయి. ఒక్క కన్వీనర్ కోటాలోనే ఏటా 7-8వేల సీట్లు ఖాళీగా ఉంటున్నాయి. కోర్ బ్రాంచీలతోపాటు కంప్యూటర్ సైన్స్ కోర్సుల్లోనూ సీట్లు పూర్తిగా నిండటంలేదు. ఈ సారి కూడా సీట్లు పూర్తిగా నిండే పరిస్థితులు కనిపించడంలేదు. రాష్ట్రంలో 175 ఇంజినీరింగ్ కాలేజీలున్నాయి. వీటిల్లో 1,18,778 బీటెక్ సీట్లున్నాయి.
2024-25 విద్యాసంవత్సరంలో కోర్ బ్రాంచిల్లో 8,291 సీట్లు, సీఎస్ఈ అనుబంధ బ్రాంచీల్లో 3,625 సీట్లు మిగిలాయి. ఈ సారి 7వేల సీట్లకు కోత పడనున్నది. 14 కాలేజీలు సీట్ల కన్వర్షన్, సీట్ల పెంపునకు దరఖాస్తు చేసుకోగా, ప్రభుత్వం తిరస్కరించింది. దీంతో ఆయా కాలేజీల్లోని 7వేల సీట్లు రద్దయ్యాయి. ఆయా సీట్లను మినహాయిస్తే ఈ సారి మొత్తం సీట్ల సంఖ్య కూడా తగ్గనున్నది. వారం, పది రోజుల్లో బీటెక్ ప్రవేశాల కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేయనున్నారు.
రాష్ట్రంలో ఇంజినీరింగ్ ఫీజుల మోత మోగనున్నది. పలు కాలేజీల్లో 10-15శాతం ఫీజులు పెరగనున్నాయి. బీటెక్ ట్యూషన్ ఫీజుల పెంపునకు తెలంగాణ ఫీజు అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ(టీఏఎఫ్ఆర్సీ)చేస్తున్న కసరత్తు చివరిదశకు చేరింది. కాలేజీలవారీగా విచారణ పూర్తిచేసిన కమిటీ, నివేదిక రూపొందించి ప్రభుత్వానికి సమర్పించింది. పలు కాలేజీలు భారీగా ఫీజులు పెంచేందుకు ప్రతిపాదనలు సమర్పించాయి. దీనిపై సర్కారు ఆరా తీస్తున్నది. ఎందుకు పెంచాల్సి వచ్చిందన్న కోణంలో పరిశీలన జరుపుతున్నది. ఇంజినీరింగ్ కోర్సుల ట్యూషన్ ఫీజులను మూడేండ్లకోసారి పెంచడం ఆనవాయితీ. చివరగా 2022 -23లో పెంచగా, ఫీజు గడువు 2024-25 విద్యాసంవత్సరంతో ముగిసింది. 2025-28 బ్లాక్ పీరియడ్ ఫీజు పెంచేందుకు టీఏఎఫ్ఆర్సీ ప్ర తిపాదనలు స్వీకరించగా, 163 కాలేజీలు ఫీజుల సవరణకు ద రఖాస్తు చేసుకున్నాయి. 19 కా లేజీలు దరఖాస్తు చేసుకోలేదు.